జీ20 సదస్సు ఘనవిజయం : జిన్‌పింగ్ కంటే మోడీ దార్శనికుడు - జిమ్ ఓ నీల్ ప్రశంసలు
జీ 20 సమ్మిట్ విజయవంతం కావడంతో మోడీ స్పష్టమైన విజేతగా నిలిచారని.. ప్రస్తుతం జిన్‌పింగ్ కంటే మోడీ దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిగా కనిపిస్తున్నారని ఓనిల్ పేర్కొన్నారు.

ఇటీవల ముగిసిన బ్రిక్స్ దేశాధినేత శిఖరాగ్ర సమావేశాల తర్వాత ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే జీ7 కూటమి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోగల విశ్వసనీయ సామర్ధ్యాన్ని కలిగి వుందని. అయితే జీ20 మాత్రమే ప్రపంచ సమస్యలకు నిజమైన పరిష్కారాలను అందించే చట్టబద్ధతతో కూడిన ఏకైక సమూహంగా మిగిలిపోయిందన్నారు ప్రఖ్యాత ఆర్ధిక వేత్త జిమ్ ఓనీల్. ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు రాసిన కాలమ్‌లో ఆయన జీ20 శిఖరాగ్ర సదస్సును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గత వారం న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ నుంచి వెలువడిన ఉమ్మడి ప్రకటన దీనికి మరింత ధ్రువీకరణను అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్య దేశాలు అనేక సమస్యలను పరిష్కరించేందుకు ఏకాభిప్రాయానికి వచ్చాయని జిమ్ అన్నారు. స్పష్టమైన సవాళ్లు వున్నప్పటికీ, గణనీయమైన వ్యత్యాసాలు వున్నప్పటికీ సభ్య దేశాలు పనిచేస్తాయని చెప్పారు. జీ20 పాత్రను ప్రశ్నార్ధకం చేసిన సుదీర్ఘకాలం తర్వాత దాని ఔచిత్యాన్ని పునరుద్ఘాటించగలిగారని జిమ్ పేర్కొన్నారు.
అంతిమ ప్రకటనను ముందుకు తీసుకురావడంలో భారత్, అమెరికాలు కీలకపాత్ర పోషించాయని.. అందుకు ఈ రెండు దేశాలను అభినందించాలని జిమ్ ఓనిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పునరుద్ధరించబడిన ప్రపంచ బ్యాంక్ ఆవశ్యకత, అంటువ్యాధుల నియంత్రణ, ఆర్ధిక స్ధిరత్వం, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రపంచం సమస్యలను పరిష్కరించడానికి బలమైన సంఘటిత ప్రయత్నంలో న్యూఢిల్లీ ప్రకటన తొలి అడుగు కావొచ్చని ఓనిల్ అభిప్రాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ లేనప్పటికీ.. ఈ ఎజెండా అంగీకరించబడటం విశేషమన్నారు.
చైనా చిరకాల ప్రత్యర్ధులలో ఒకటైన భారతదేశాన్ని, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడానికే జీ జిన్‌పింగ్ జీ20 శిఖరాగ్ర సమావేశానికి గైర్హాజరయ్యారని చాలా మంది ఊహిస్తున్నారని ఓనిల్ పేర్కొన్నారు. అతని నిర్ణయం ఇటీవలి బ్రిక్స్ సమావేశ ప్రాముఖ్యతను బలహీనపరిచేలా వుందని.. దీనిని చాలా మంది చైనా విజయంగా భావిస్తున్నారని ఆయన చెప్పారు. భారత్, చైనాల మధ్య సంఘీభావం లేకపోవడం బ్రిక్స్‌కు పెద్ధ అవరోధంగా ఓనిల్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జీ20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడం రెండు దేశాల మధ్య విభేదాలను మరింతగా పెంచిందన్నారు. జీ 20 సమ్మిట్ విజయవంతం కావడంతో మోడీ స్పష్టమైన విజేతగా నిలిచారని.. ప్రస్తుతం జిన్‌పింగ్ కంటే మోడీ దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిగా కనిపిస్తున్నారని ఓనిల్ పేర్కొన్నారు.
అంతేకాకుండా జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చడానికి అంగీకరించడం అత్యంత కీలకమైనదని ఆయన అన్నారు. తద్వారా జీ20 కాస్తా జీ 21గా మారిందన్నారు. ఈ పురోగతి మోడీకి దౌత్య విజయాన్ని అందించి.. గ్లోబల్ సౌత్ ఛాంపియన్‌గా తన ఇమేజ్‌ను మరింత పెంచుకోవడానికి వీలు కల్పించిందని ఓనిల్ చెప్పారు. ఇది ఈజిప్ట్, ఇథియోపియాలను కలిగివున్న బ్రిక్స్ స్వంత విస్తరణ, యాదృచ్ఛిక స్వభావాన్ని మరింత నొక్కి చెబుతుందన్నారు. కానీ నైజీరియా వంటి ముఖ్యమైన ఆఫ్రికన్ దేశాలు కాదని ఆయన తెలిపారు. అయితే టేబుల్‌పై శాశ్వత సీటు ఆఫ్రికన్ యూనియన్‌ను మరింత ప్రభావంతమైన సంస్థగా మారుస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా ఓనిల్ పేర్కొన్నారు.
బ్రిక్స్, జీ20తో పోలిస్తే జీ7 ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన సంస్థ అని నమ్మే వ్యక్తులతో తాను మాట్లాడానని ఆయన అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యలపై అతి చూపిన సంఘీభావానికి ఇది నిదర్శనమన్నారు. ఉక్రెయిన్ విషయానికి వస్తే జీ7 ముఖ్యమైనది కానీ నాటో కాదని ఓనిల్ తెలిపారు. జీ20 అనేది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, వాతావరణ మార్పు, ప్రజారోగ్యం వంటి ఇతర సమస్యలపై నిజంగా ముఖ్యమైన సామూహిక స్వరంగా ఆయన అభివర్ణించారు. జీ7 లీడర్స్ ఇప్పటికీ ప్రపంచ వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని భావించాలనుకుంటున్నారు. అయితే వాస్తవం వేరేలా వుంది.. న్యూఢిల్లీ సమ్మిట్ ద్వారా తేలింది ఏంటంటే, అభివృద్ధి చెందుతున్న శక్తులను కలుపుకుంటే తప్ప వీరు ప్రపంచ సవాళ్లను ఎదుర్కోలేరని ఓనిల్ పేర్కొన్నారు.