జీ20 సదస్సు : చైనా ప్రతినిధుల బసచేసిన హోటల్లో 12 గంటల హై డ్రామా, అనుమానిత బ్యాగులపై నోరువిప్పని డ్రాగన్స్...
చైనా ప్రతినిధులు బస చేసిన హోటల్లో వారితోపాటు తెచ్చిన కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో వివాదం మొదలయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

న్యూఢిల్లీ : ఢిల్లీ : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చిన అధినేతలు, ప్రతినిధులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య రక్షణను కల్పించారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఓ ఘటన 12 గంటల పాటు హైడ్రామా నెలకొనేలా చేసింది. చైనా ప్రతినిధుల బృందం దగ్గర ఉన్న కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించి కలకలం సృష్టించాయి.
దీంతో 12 గంటల పాటు హైడ్రామా చోటు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసిందని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. గత గురువారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని ప్రముఖ హోటల్లో జి20 సదస్సు కోసం విచ్చేసిన చైనా ప్రతినిధుల బృందం బస చేసింది. అయితే, హోటల్లోకి వెళ్లే ముందు.. చెక్ చేసిన భద్రతా సిబ్బందికి.. రెండు బ్యాగులు అసాధారణ కొలతలతో ఉన్నట్లు కనిపించాయి.
కానీ, ప్రోటోకాల్ ప్రకారం వారిని భద్రతా సిబ్బంది లోపలికి పంపించారు. అక్కడ ఆ బ్యాగులను తనిఖీ చేసిన హోటల్ సిబ్బందికి అనుమానాస్పద పరికరాలు కనిపించాయి. వెంటనే వారు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ బ్యాగులను స్కానర్ల కింద ఉంచి చెక్ చేయాలని చైనా ప్రతినిధులను భద్రత అధికారులు అభ్యర్థించారు. కానీ, దీనికి చైనా ప్రతినిధుల బృందం ఒప్పుకోలేదు. రెండు వర్గాలు ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉండడంతో సమస్య మొదలై… దాదాపు 12 గంటల పాటు ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
సమస్య పూర్తిగా సద్దుమణిగి, కొలిక్కి రావడానికి 12 గంటల సమయం పట్టిందని సమాచారం. ఇంతకీ ఈ సమస్య ఎలా కొలిక్కి వచ్చిందంటే.. 12 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత అనుమానిత బ్యాగులను చైనా ఎంబసీకి పంపడానికి చైనా అధికారులు ఒప్పుకున్నారు. దీంతో వివాదం అక్కడితో ముగిసింది. కానీ ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏమున్నాయో మాత్రం తెలియ రాలేదు. జి 20 దేశాధినేతల సదస్సు సెప్టెంబర్ 9, 0 తేదీల్లో ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ హాజరు కాలేదు.
ఆయనకు బదులుగా చైనా ప్రీమియర్ లీ కియాంగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో డ్రాగన్ స్పందిస్తూ.. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో జీ20 దేశాలతో చేతులు కలుపుతున్నామని సంకేతాన్ని ఢిల్లీ డిక్లరేషన్ ఇస్తుందని తెలిపింది.