తమిళ సర్కార్ సంచలన నిర్ణయం.. అలా చేసే వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
తమిళనాడు ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

తమిళనాడు ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. అవయవ దానాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అవయవ దాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. ఈ సందర్బంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. అవయవదానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని, దీంతో వందలాది మంది రోగులకు నూతనోత్సాహం చేకూరిందని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని స్టాలిన్ అన్నారు. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని పురస్కరించుకుని అంత్యక్రియలకు రాష్ట్ర గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం స్టాలిన్ తెలిపారు.