ప్రపంచమంతా కోవిడ్‌తో అల్లాడుతున్న వేళ.. భారత్ మాత్రం ఆ మహమ్మారిని అదుపులో పెట్టగలిగింది. ఈ నేపథ్యంలోనే భారతదేశం అనుసరించిన విధానాలను ఇతర దేశాలు అనుసరించాలని పలువురు నేతలు, నిపుణులు సూచిస్తున్నారు.
2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ (coronavirus) ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మనిషిని నాలుగు గోడలకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టింది. అంతేనా కోట్లాది మంది దీని బారినపడగా.. లక్షలాది మంది మరణించారు. ఇప్పటికే ఉత్పరివర్తనం చెంది రకరకాల పేర్లతో పలు దేశాలపై విరుచుకుపడుతోంది. డెల్టా, బీటా, ఒమిక్రాన్, డెల్టా క్రాన్ పేర్లతో ఇప్పటికీ అంతం కాకుండా మానవాళికి సవాల్ విసురుతోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే భారత్ మాత్రం కరోనాతో విజయవంతంగా పోరాడింది. దీనికి ప్రధాన కారణం వ్యాక్సినేషన్ డ్రైవ్. దీంతో ప్రపంచం దృష్టి భారత్‌పై పడింది. అంతేకాదు పలువురు దేశాధినేతలు కోవిడ్‌పై భారత్ పోరాటాన్ని, టీకా ప్రచారాన్ని ప్రశంసిస్తున్నారు.
బిల్‌గేట్స్, మెలిందా ఫౌండేషన్ (bill gates and melinda gates foundation) నిర్వహిస్తున్న ‘‘అక్ష’’ కార్యక్రమంలో ఇతర దేశాలు కరోనా పోరాటాన్ని స్వీకరించాలని యునిసెఫ్ (unicef) , ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health organization) , ఆసియన్ డెవలప్‌మెంట్ (asian development bank) బ్యాంక్‌లకు పలువురు ప్రపంచ నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో భారత్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠశాలకు సంబంధించి ఇవాళ ఓ కార్యక్రమం నిర్వహించారు. యునిసెఫ్ ప్రాంతీయ అధిపతి, ప్రైవేట్ నిధుల సేకరణ అధికారి యుసుమాసా కిమురా భారత్‌ను అభినందించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి తన పౌరులు భారత్ కోవిడ్ నుంచి రక్షించుకుందని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ఇతర దేశాలకు కూడా సహాయపడిందని కిమురా పేర్కొన్నారు.
అతిపెద్ద దేశంలో అతిపెద్ద టీకా ప్రచారం విజయవంతంగా నిర్వహించబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్ రోడ్రిగో ఆఫ్రిన్ అన్నారు. వ్యాక్సిన్ ప్రచారాన్ని ఎలా నిర్వహించాలో భారతదేశం ప్రపంచానికి చూపించిందన్నారు.
కరోనాపై పోరాటంలో భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని.. వరల్డ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్ టెకో కొనిషి అన్నారు. భారత్ నుంచి నేర్చుకున్న పాఠాలను ప్రపంచం స్వీకరించాలని.. దీని వల్ల కోవిడ్‌పై సమర్థవంతంగా పోరాడవచ్చని కొనిషి వ్యాఖ్యానించారు.
కరోనాపై యుద్ధంలో భారత్ గెలవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయని బిల్‌గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ ఎలియాస్ వ్యాఖ్యానించారు. సాహసోపేతమైన నాయకత్వం, సైన్స్‌లో సరికొత్త ఆవిష్కరణలు, వాటిని త్వరితగతిన ఉపయోగించడం, దూరదృష్టి ప్రాజెక్ట్‌లు ఇందుకు కారణమని క్రిస్ అన్నారు.
ఇకపోతే.. వ్యాక్సినేషన్ తో Covid-19కు మరింత చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ మెజారిటీగా పూర్తి చేయగా తాజాగా booster dose మీద దృష్టి సారించింది. 18యేళ్లు పై బడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 యేళ్లు పైబడిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. రెండో డోస్ తీసుకున్నాక 9 నెలలు లేదా 39 వారాల తరువాత బూస్టర్ డోస్ కు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఫోర్త వేవ్ వచ్చే అవకాశం ఉండడంతో బూస్టర్ డోస్ లపై దృష్టి సారించింది. ఇప్పటివరకు 181 కోట్ల 24 లక్షల 97వేల 303 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా త్వరలోనే బూస్టర్ డోసుల పంపిణీ స్టార్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ (covishield) రెండు మోతాదుల మధ్య అంతరాన్ని 12-16 వారాల నుంచి 8-16 వారాలకు తగ్గించాలని ఇమ్యునైజేసణ్ పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని అధికారులు తెలిపారు.
నిరుడు మే 13వ తేదీన యునైటెడ్ కింగ్ డమ్ నుంచి వచ్చిన రియల్ లైఫ్ ఎవిడెన్స్ ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం 12-16 వారాలకు పెంచింది. అంతకు ముందు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి 6-8 వారాలుగా ఉండేది. ప్రస్తుతం పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలో 60యేళ్లు పై బడిన వృద్ధులకు, ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి బూస్టర్ డోసులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కవ మంది లభ్దిదారులకు ఈ డోసు చేరాలనే ఉద్దేశ్యంతో కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ ఈ వ్యవధి తగ్గించాలని సిఫార్సు చేసింది.
