లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కిరాకతమైన హత్య జరిగింది. ఓ యువకుడిని స్నేహితులు హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కులుగా నరికి బోరు బావిలో పడేశారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పోలీసులు హతుడి మృతదేహం కోసం బోరు బావిని తవ్వుతూనే ఉన్నారు. ఈ తవ్వకంలో బోరు బావిలో నీళ్లు పడ్డాయే గానీ మృతదేహం జాడ కనిపించలేదు.  

మీటర్ కు చెందిన ఐటీఐ విద్యార్థి రూపక్ (20) గత నెల 25వ తేదీన మిత్రులను కలవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా తిరిగి రాలేదు. దాంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రూపక్ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. 

రూపక్ సోదరి గురించి స్నేహితులు చెడుగా మాట్లాడడంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో స్నేహితుల్లో ఒకతను తుపాకీతో రూపక్ ను కాల్చి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ పొలంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పాతిపెట్టారు. అయితే, పోలీసులకు దొరికిపోతామనే భయంతో మృతదేహాన్ని వెలికి తీసి ముక్కలుగా నరికారు. 

ఆ తర్వాత ఆ ముక్కలను ఊరి వెలుపల ఉన్న బోరుబావిలో పడేశారు. ఆ విషయాన్ని వారు పోలీసులకు చెప్పారు. దాంతో గత మూడు రోజులుగా రూపక్ మృతదేహం కోసం బోరు బావిని తవ్వుతూనే ఉన్నారు. కానీ ఆధారాలు లభించలేదు. 

శరీరభాగాలు బోరు బావిలో చాలా లోతులో పడి ఉంటాయని భావిస్తున్నారు. లేదా నిందితులు పోలీసులు తప్పుడు సమాచారమైనా ఇచ్చి ఉండాలని అనుమానిస్తున్నారు. పోలీసులు నీటి పారుదల శాఖ అధికారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు బోరు బావిని 50 అడుగుల లోతు తవ్వారు. నీళ్లు పడ్డాయి గానీ రూపక్ శరీర భాగాలు కనిపించలేదు. రూపక్ శరీర భాగాలు లభించకపోతే నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.