పాఠశాలల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్?.. సుప్రీంకోర్టులో నేడే విచారణ
Free Sanitary Pads: 6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

Free Sanitary Pads: విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. 6 నుంచి 12వ తరగతి వరకు బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దత్తత తీసుకునేలా పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఋతు పరిశుభ్రత కోసం ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని , జాతీయ నమూనాను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఏప్రిల్ 10న, ఈ సమస్య "అత్యంత ప్రాముఖ్యం" అని, ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలలతో సహా పాఠశాలల్లో రుతుస్రావ పరిశుభ్రత నిర్వహణపై ఏకరీతి జాతీయ విధానాన్ని అమలు చేయడానికి కేంద్రం అన్ని వాటాదారులతో చర్చలు జరపాలని సుప్రీం కోర్టు పేర్కొంది. దీని కోసం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయంతో జాతీయ విధానాన్ని రూపొందించడానికి సంబంధించిన సంబంధిత డేటాను సేకరించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) కార్యదర్శిని నోడల్ అధికారిగా సుప్రీంకోర్టు నియమించింది.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ , జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఋతు పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి పథకాలను అమలు చేస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్ జయ ఠాకూర్ తన పిటిషన్‌లో నిరుపేద నేపథ్యం నుండి వచ్చిన యుక్తవయస్సులోని బాలికలు విద్యను పొందడంలో తీవ్రమైన ఇబ్బందులను ప్రస్తావించారు.
సర్వోన్నత న్యాయస్థానంలో జరగనున్న విచారణపైనే అందరి చూపు పడింది. పీరియడ్స్ అంటే ఇంకా బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడడం ఆందోళన కలిగించే అంశం. 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు చదువులో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి.
ఎందుకంటే 11 నుండి 12 సంవత్సరాల వయస్సులో.. అమ్మాయిలకు పీరియడ్స్ రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వారు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, కానీ చాలా మంది ఆడపిల్లలు సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు. నేటికీ, చాలా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతో, పాత బట్టలు గడ్డి, బూడిద, ఇసుక వేసి ప్యాడ్‌లను తయారు చేస్తారు. దీని వల్ల వారికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
ఈ సమయంలో బాలికలు ఇబ్బందులెదుర్కొవడంతో పాఠశాలను మధ్యలోనే వదిలివేస్తున్నారు. దీని వల్ల వారి చదువు దెబ్బతింటుంది. ఇలాంటి ఇబ్బందులు ప్రస్తవిస్తూ న్యాయవాది వరీందర్ కుమార్ శర్మ ద్వారా జయ ఠాకూర్ పిటిషన్ దాఖాలు చేశారు.