హర్యానాలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా మూడు నెలల్లో ఏడుగురిని పెళ్లి చేసుకుని.. మొదటి రాత్రే డబ్బు, నగలతో జంప్ అయిన వధువు గుట్టు రట్టయ్యింది. ఆ కి‘లేడీ’ వలలో చిక్కుకున్న బాధితులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
హర్యానా : అందంతో వలపువల విసిరి అమాయకపు మోమూతో.. కట్టిపడేసి.. ఆ తరువాత విశ్వరూపం చూపిస్తూ.. ఏడుగురు పెళ్లికొడుకులకు చుక్కలు చూపించిందో కి‘లేడీ’. ఒకరిమీద ఒకరిని ఏకంగా మూడు నెలల్లో ఏడుగురిని పెళ్లి చేసుకుంది. పది, పదిహేను రోజుల వ్యవధిలో పరిచయం చేసుకోవడం, వారిని పెళ్లి దాకా తీసుకురావడం.. తాను అనాథగా నమ్మించడం.. మొదటి రాత్రే.. ఊహించని షాక్ ఇచ్చి జంప్ అవ్వడం.. ఇది ఆ కిలేడి స్ట్రాటజీ.. దీనికి ఆమెకు ఆమె ముఠాలోని ఎనిమిది మంది సహకరించేవారు. అయితే ఓ వ్యక్తికి అనుమానం రావడంతో విషయం బయటపడి.. ఆమె కటకటాల్లో పడింది.
అనాథలా తనను పరిచయం చేసుకోవడం.. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం.. మొదటి రాత్రి భర్తకు మత్తుమందు ఇవ్వడం… డబ్బు, నగలతో మాయమవడం.. ఇదే స్క్రిప్ట్ ను ఒకటి కాదు రెండు కాదు.. మూడు నెలల వ్యవధిలో ఏడు సార్లు ప్రయోగించింది ఆ యువతి. ఏడుగురు పెళ్లి కుమారులను మోసగించింది. చివరకు యువతితో పాటు ఆమె ముఠా సైతం పోలీసులకు చిక్కింది. హర్యానాకు చెందిన ఓ యువతి పెళ్లికాని యువకులను, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకునేది.
వారికి వలపు వల విసిరి పెళ్లి వరకు తీసుకు వెళ్ళేది. వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి మత్తుమందు మాత్రలు ఇచ్చి.. ఇంట్లో ఉన్న డబ్బు నగలతో ఉదయించేది. భర్తకు అనుమానం వచ్చేలోపే ముఠాతో కలిసి ప్రణాళికను అమలుచేసేది. ఈ పథకం అమలు కాకపోతే మరో మార్గం ఎన్నుకునేది.వరకట్నం వేధింపుల పేరుతో భర్తను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేది. తనకు తల్లిదండ్రులు లేరని అందరినీ నమ్మించేది. ఇందుకు ఆమె ముఠా సభ్యులు సహకరించేవారు. ఈ గ్రూపులో మ్యారేజ్ ఏజెంట్, నలుగురు పురుషులు సహా ముగ్గురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.
ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్ ను యువతి మొదటగా పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా ఆమెను పెళ్ళాడాడు. ఇక ఆమె రెండో పెళ్లి జనవరి 1న రాజస్థాన్ లో జరిగింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం, ఫిబ్రవరి 21న 4 వివాహం రాజేందర్ తో జరిగింది. 5 పెళ్లి కుటానాకు చెందిన గౌరవ్ తో… ఆరో వివాహం కర్ణాటకకు చెందిన సందీప్ తో జరిగింది. చివరగా మార్చి 26న బుద్వాకు చెందిన సుమిత్ తో ఆమెకు ఏడో పెళ్లి జరిగింది. సదరు యువతిని వివాహం చేసుకున్న నాలుగో వ్యక్తి నౌల్తాకు చెందిన రాజేందర్ ఈ వ్యవహారంలో పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది.
తన వద్ద డబ్బులు, నగలతో ఆమె పారిపోవడంతో మోసపోయిన విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు. మరో వైపు ఆమె భర్తకు సంబంధించిన సమాచారం సేకరించి, రిజిస్ట్రేషన్ పత్రాలతో ఆయన వద్దకు వెళ్ళాడు. వారిద్దరూ ఆమె నిజస్వరూపాన్ని పసిగట్టేలోపే శనివారం ఆమెఏడో వివాహం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరూ ఇచ్చిన ఫిర్యాదుతో యువతిని ఆమె సహచరులు పోలీసులు అరెస్టు చేశారు.
