Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: సుప్రీంకోర్టులో కరోనా కలవరం.. నలుగురు జడ్జీలకు పాజిటివ్.. క్వారంటైన్‌లో 150 మంది స్టాఫ్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా, సుప్రీంకోర్టులోనూ దాని ఉనికి చాటినట్టు తెలుస్తున్నది. నలుగురు న్యాయమూర్తులు కరోనా బారిన పడ్డట్టు సమాచారం. ఆ భయాలతోనే సుమారు 150 మంది క్వారంటైన్‌లోకి చేరారు. లేదా.. ఇందులో కొందరు కరోనా పాజిటివ్ అని కూడా తేలింది. పార్లమెంటులోనూ సుమారు 400 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వచ్చాయి. 
 

four supreme court judges coronavirus positive
Author
New Delhi, First Published Jan 9, 2022, 1:39 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(Coronavirus) దేశవ్యాప్తంగా వేగంగా చుట్టుకొస్తున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) ఈ భయాలను రెట్టింపు చేసింది. సాధారణ పౌరులతోపాటు ప్రభుత్వాధినేతలు, పార్లమెంటు, సుప్రీంకోర్టులోనూ పంజా విసురుతున్నది. రాజస్తాన్, జార్ఖండ్‌తోపాటు ఇంకొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్(Positive) అని తేలింది. ప్రభుత్వ అధినేతలే కాదు.. పార్లమెంటులో ఇప్పటికే సుమారు 400 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు సంచలన వార్తలు వచ్చాయి. తాజాగా, సుప్రీంకోర్టు(Supreme Court)లోనూ ఈ మహమ్మారి కలకలం రేపింది. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తు(Judges)లకు కరోనా సోకినట్టు సమాచారం. అంతేకాదు, 150 మంది సిబ్బంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇందులో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలినవారూ ఉన్నారు.

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కలుపుకుని 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇందులో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. తొలుత ఓ న్యాయమూర్తికి జ్వరం వచ్చింది. ఆయన మంగళవారం జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి వీడ్కోలు కార్యక్రమానికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఆయన కరోనా టెస్టు రిజల్ట్‌లో పాజిటివ్ అని తేలింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో ఓ సమావేశం జరిగింది. ‘దేశంలో మరోసారి ఆ సమస్య పెరుగుతున్నది. వీటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేసులు పెరుగుతున్నాయి. అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల పాటు ప్రత్యక్షంగా విచారంచలేకపోవచ్చు’ అని ఆ సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వారాలపాటు ఆన్‌లైన్‌లోనే విచారణ చేపట్టనున్నారు. కానీ, కొన్ని తీవ్రమైన కేసులను మాత్రమే ప్రత్యక్షంగా విచారిస్తామని తెలిపారు.

2020లో మన దేశంలోకి మహమ్మారి ప్రవేశించినప్పుడు తొలిసారిగా సుప్రీంకోర్టు వర్చువల్ హియరింగ్‌కు మొగ్గు చూపింది. సుమారు ఏడాది పాటు సుప్రీంకోర్టు ఆన్‌లైన్‌లోనే వాదనలు విని విచారణ చేపట్టింది. కానీ, కరోనా కేసులు తగ్గుతుండటంతో గతేడాది అక్టోబర్‌లో మళ్లీ ప్రత్యక్ష విచారణ చేపట్టే నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా, ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. నిన్న 40,863 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603కు చేరింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 5,90,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇప్పటివరకు దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.  భారత్‌లో ఇప్పటివరకు 3,623 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,409 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వివరాలను వెల్లడించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 513 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో  ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios