నాసిక్ లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి నలుగురు ముస్లింలు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆలయ నిర్వాహకులు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించేందుకు ప్రభుత్వం ‘సిట్’ ను ఏర్పాటు చేసింది.
మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. ఆలయ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు నిందితులు అకిల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకిల్ సయ్యద్, మతీన్ రాజు సయ్యద్, సలీం బక్షు సయ్యద్ అనే యువకులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
అతిక్ అహ్మద్ తరహాలోనే.. యూపీ కోర్టులో ఇద్దరు హత్యా నిందితులపై దుండగుల కాల్పులు..
‘ఇండియా టు డే’ కథనం ప్రకారం.. ఆ యువకులు ఈ నెల 13వ తేదీన చందనం ఊరేగింపులో భాగంగా త్రయంబకేశ్వర్ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. శివలింగానికి చాదర్ సమర్పించేందుకు ప్రయత్నించారు. గొప్ప ముస్లిం సాధువుల ఉర్స్ (వర్ధంతి) లో భాగంగా వారి గౌరవార్థం ఈ ఊరేగింపు నిర్వహిస్తారు.
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. విష వాయువులు పీల్చి ఇద్దరు మృతి..
కాగా.. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర్ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆ ముస్లిం యువకుల గుంపును ఆలయంలోకి ప్రవేశించడాన్ని సెక్యూరిటీ గార్డులు చూశారు. వెంటనే వారిని ఆలయంలోకి వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఆలయ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
మరోవైపు.. ఈ ఊరేగింపు నిర్వాహకుడు మతీన్ సయ్యద్ మాట్లాడుతూ.. తాము చాలా సంవత్సరాలుగా ఈ ఊరేగింపు రోజున శివుడికి చాదర్ చూపిస్తున్నామని తెలిపారు. అలా చాదర్ చూపించేవారు ఆలయంలోకి ప్రవేశించబోరని అన్నారు. నిందితులు శివలింగానికి చాదర్ సమర్పించడానికి ప్రయత్నించలేదని, వారు చాదర్ ను ఆలయ మెట్ల వరకు మాత్రమే తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ లో విషాదం.. నెలల క్రితం కోడలు, మూడు రోజుల కిందట కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక తల్లి మృతి..
కాగా.. ఈ ఘటనపై ఆలయ ట్రస్టు ఫిర్యాదు మేరకు మంగళవారం నలుగురిని అరెస్టు చేసి ఐపీసీ 295, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై విచారణ జరిపేందుకు ‘సిట్’ ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలను పరిరక్షించాలన్న తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా వదిలిపెట్టం! ఇవి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు. దీనిని సహించేది లేదు. మన పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నారు.’’ అని ఫడ్నవీస్ తెలిపారు.
