రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంత జిల్లా జోధ్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఒసియాన్‌లో మంగళవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులు.. అనంతరం వారి ఇంటికి నిప్పంటించారు.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంత జిల్లా జోధ్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఒసియాన్‌లో మంగళవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులు.. అనంతరం వారి ఇంటికి నిప్పంటించారు. మృతుల్లో ఒక బాలికతో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
తొలుత వారిని గొంతు కోసి చంపేసి.. ఆ తర్వాత గుడిసెలో సజీవ దహనం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అత్యంత దారుణ ఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది. ఇక, మృతుల్లో కుటుంబ పెద్ద పూనరం బైర్డ్ (55), అతని భార్య భన్వరీదేవి (50), కోడలు ధాపు (24), 6 నెలల పాప కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒసియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగనియోకి ధానిలో గుడిసెలో నివసిస్తున్న ఒక కుటుంబానికి చెందినవారిని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం గుడిసెకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఎల్, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
ఇక, ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే ఈ షాకింగ్ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ స్పందిస్తూ.. రాజస్థాన్‌లో పెరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రశ్నలు సంధించారు. అశోక్ గెహ్లాట్ సొంత జిల్లా జోధ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుందని అన్నారు. ఒక కుటుంబంలోని నలుగురిని నరికి హత్య చేసి.. సజీవ దహనం చేశారని చెప్పారు. ఇందులో 6 నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేస్తుందని పేర్కొన్నారు.
ఇటీవల కరౌలీలో 19 ఏళ్ల దళిత యువతిపై హత్య, అత్యాచారం, యాసిడ్ దాడి జరిగిందని.. సికార్‌లో వీధి పోరాటాలు చోటుచేసుకున్నాయని, జోధ్‌పూర్‌లో పాఠశాల బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పారు. రాజస్థాన్‌లో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ అంటే అరాచకానికి హామీ అని మండిపడ్డారు. అయితే ఈ ఘటననలపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. ‘‘నేను ఆడపిల్ల’’ అన్నది వట్టి నినాదమేనని.. స్త్రీలు, పిల్లలు వారికి రాజకీయ సాధనాలు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
