అలప్పుజ: కేరళలో భార్యల మార్పిడి ఉదంతం వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తపై ఫిర్యాదు చేయడంతో ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది.కేరళలోని అలప్పుజ జిల్లాలోని కయంకుళంలో ఓ భర్త ఓ దారుణమైన విషయానికి పాదులు వేశాడు. భార్య ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగినిగా పనిచేస్తుండగా భర్త స్మార్ట్‌ఫోన్‌లో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ యాప్స్‌లో చాట్ చేస్తూ గడిపేవాడు. 

అలా ఓ చాటింగ్ యాప్‌లో చాటింగ్ చేస్తుండగా పరిచయం లేని నలుగురు వ్యక్తులు పరిచయమయ్యారు. ఆ వ్యక్తుల్లో ఒకతను నిందితుడి భార్యపై మోజు పడ్డాడు. ఆ విషయాన్ని అతనికి చెప్పాడు. తన భార్యతో కలిసే ఏర్పాటు చేస్తానని నిందితుడు మాటిచ్చాడు. మాటివ్వడమే కాకుండా తన భార్యకు మాయమాటలు చెప్పి మోజు పడ్డ వ్యక్తి కారులోకి బలవంతంగా పంపించాడు. 

ఇలా ఒకరి వద్దకు కాదు నలుగురు వివాహిత వ్యక్తుల వద్దకు బెదిరించి బలవంతంగా తన భార్యను పంపాడు. వారి భార్యలతో ఇతనూ గడుపుతూ వచ్చాడు. తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కొల్లాంలోని కేరళపురానికి తన భార్యను తీసుకెళ్లి చాట్‌లో పరిచయమైన వ్యక్తులతో కలిసి గడపాల్సిందిగా ఆమెను బలవంతం చేశాడు. 

తన భార్య అంగీకరించకపోవడంతో ఆమెతో గొడవ పడ్డాడు. గ్రూప్‌గా కలిసి గడపాల్సిందిగా ఒత్తిడి చేశాడు. అది భరించలేక భార్య గత వారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ భార్యల మార్పిడి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేశారు. 

పోలీసులు ఆమె భర్తతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురు వివాహితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురూ కేరళలోని నాలుగు వేరువేరు జిల్లాలకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఏడాది కాలంగా ఈ భార్యల మార్పిడి వ్యవహారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.