కరోనా బారినపడిన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారు. ఆయనకు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫెరల్ ఆసుపత్రి వెల్లడించింది.

ప్రణబ్ ఆరోగ్య పరిస్ధితిపై శనివారం బులెటిన్ విడుదల చేసింది. దాదా ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స కొనసాగిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ ఇంకా డీప్ కోమాలోనే ఉన్నప్పటికీ గతంలో కంటే ఆరోగ్య సూచీల్లో మెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రణబ్ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్ రేటు స్థిరంగా, సాధారణంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. మాజీ ఉప రాష్ట్రపతి మూత్రపిండ సంబంధిత వ్యవస్థ పని తీరు కూడా కాస్త మెరుగ్గానే ఉన్నట్లు తెలిపారు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన ప్రణబ్ ముఖర్జీకి డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.

ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని డాక్టర్లు తెలిపారు.