మోడీ ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసించిన వేళా..
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ సరైన వైఖరి అవలంభించిందని అన్నారు. భారత సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ శాంతి కోసం ప్రయత్నాలు చేసిందని వివరించారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ సరైన వైఖరి అవలంభించిందని అన్నారు. దేశ సార్వభౌమత్వ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ శాంతి కోసం పిలుపు ఇవ్వడం సమర్థనీయం అని వివరించారు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత చర్చే పరిష్కారం అని భారత్ తన వైఖరిని సుస్థిరంగా కొనసాగిస్తున్నది.
జీ 20 శిఖరాగ్ర సమావేశాల కోసం ప్రపంచ దేశాల అధినేతలు దేశానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉన్నది.
Also Read : లోన్ రికవరీ కోసం పోలీసు స్టేషన్‌ను కూడా అటాచ్ చేశారు.. చివరకు ఏం జరిగిందంటే?
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాలు, చైనాల మధ్య భౌగోళిక రాజకీయాల సంఘర్షణల నేపథ్యంలో మారుతున్న అంతర్జాతీయ వైఖరుల గురించి చర్చించారు. రాజ్యాంగ విలువలు, శాంతియుత ప్రజాస్వామిక దేశమైన భారత్.. ఈ నూతన ప్రపంచ పరిణామాల్లో కీలక పాత్ర పోషించాల్సి ఉన్నదని వివరించారు.