తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోడీకి ఆదివారం ఓ లేఖ రాశారు. హిందీ భాషను ఇతర భాషలు మాట్లాడే వారిపై ప్రయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోడీకి ఆదివారం ఓ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని విద్యా సంస్థల్లో హిందీ మీడియం తప్పనిసరి చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినట్టు వార్తలపై ఆయన ఈ లేఖ రాశారు. కేంద్ర మంత్రి అమిత్ షా సారథ్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాల్లోనూ హిందీ మీడియం తప్పనిసరి చేయాలని, ఇంగ్లీష్ స్థానంలో హిందీని చేర్చాలని ప్రతిపాదనలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, కొన్ని ఉద్యోగాలకు హిందీలో చదివితేనే అర్హులని, మరికొన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఇంగ్లీష్ బదులు హిందీ పరీక్ష పేపర్లు ప్రవేశపెట్టాలనే నిర్ణయాలూ జరిగినట్టు తెలిసిందని ఆ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. మన భారత రాజ్యాంగం చెప్పే సమాఖ్య స్ఫూర్తికి ఇవన్నీ విరుద్ధమైనవని, బహుళ భాషా సంస్కృతి గల మన దేశ స్థితిని గాయపరుస్తుందని పేర్కొన్నారు.
మన దేశంలో హిందీ మాట్లాడేవారికంటే, హిందీయేతర భాషలు మాట్లాడేవారి సంఖ్యనే ఎక్కువ అని సీఎం పేర్కొన్నారు. ప్రతి భాషకు ఒక చరిత్ర ఉంటుందని, ఆ సంస్కృతిని కచ్చితంగా గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ సంపన్న చరిత్రను, ప్రత్యేకతను కాపాడాలనే లక్ష్యంతోనే ఇతర భాషలపై హిందీని ప్రయోగించలేదని, అందుకే అన్ని భాషలను అనుసంధానించే భాషగా ఇంగ్లీష్‌ను కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా ఎంచుకున్నారని వివరించారు.
హిందీని ఇతర భాషలు మాట్లాడేవారిపై రుద్దడం అంటే అది ఇంప్రాక్టికల్ అని, విచ్ఛిన్నకర క్యారెక్టర్ అని పేర్కొన్నారు. ఇది హిందీయేతర భాషలు మాట్లాడేవారికి డిజాడ్వాంటేజ్ అని వివరించారు. ఇది కేవలం తమిళనాడు ప్రజలే కాదు, మాతృభాషను గౌరవించే ఏ ఇతర రాష్ట్రాలు కూడా అంగీకరించవని పేర్కొన్నారు.
ఇండియాను సమైక్యంగా, సమన్వయంగా ఉంచడానికి హిందీయేతర భాష మాట్లాడేవారు కోరుకునే వరకు ఇంగ్లీష్ భాషను అధికారిక భాషగా కొనసాగిస్తామని ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ భరోసా ఇచ్చారని తెలిపారు. అందుకోసమే 1968, 1976లో అధికారిక భాషపై తీర్మానాలు పాస్ చేశారని పేర్కొన్నారు. అధికారిక భాష గురించి మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలని వివరించారు.
