Bhubaneswar: ప్రముఖ బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ సూర్జ్య నారాయణ్ పాత్రో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శనివారం మరణించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం ఆయ‌న‌ను ఆసుపత్రిలో  చేర్పించారు. ఈ క్ర‌మంలోనే  రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 

Surjya Narayan Patro passes away: ప్రముఖ బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ సూర్జ్య నారాయణ్ పాత్రో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శనివారం మరణించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం ఆయ‌న‌ను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్ర‌మంలోనే రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. సుర్జ్య నారాయ‌ణ్ పాత్రో ఏడుసార్లు శాసనసభ్యుడిగా, దిగపహండి సిట్టింగ్ బీజేడీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీజేడీ ఎమ్మెల్యే, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ సూర్జ్య నారాయణ్ పాత్రో కన్నుమూశారు. దిగపహండి ఎమ్మెల్యే, ఒడిశా మాజీ స్పీకర్, సుర్జ్య నారాయణ్ పాత్రో శనివారం రాత్రి 7:31 గంటలకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశార‌ని ఆయ‌న కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు. ప్ర‌స్తుత అందుతున్న నివేదిక‌ల ప్ర‌కారం.. పాత్రో ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శ‌నివారం ఆసుపత్రిలో చేరారు. పాత్రో ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దిగపహండి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ బీజేడీ ఎమ్మెల్యే.

పాత్రో డిసెంబర్ 24, 1948న గంజాంలోని బెర్హంపూర్‌లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేసి న్యాయ‌వాద వృత్తిలో కొన‌సాగారు. కొంత‌కాలం సామాజిక సేవలో కొన‌సాగారు. 1977లో సుర్జ్య పాత్రో బెర్హంపూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక‌య్యారు. ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1990లో మోహన నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2009 వరకు వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మొదటి రెండు పర్యాయాలు జనతాదళ్ నుంచి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి బీజేడీ టిక్కెట్‌పై గెలుపొందారు. 2009 నుంచి వరుసగా మూడు పర్యాయాలు దిగపహండి ఎమ్మెల్యేగా ఉన్నారు.

బిజూ పట్నాయక్, నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలలో మంత్రిగా, వివిధ ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. ఆయన అటవీ అండ్ పర్యావరణం, ఇంధనం, పర్యాటకం, ఐటీ, సంస్కృతి, రెవెన్యూ, సమాచార-పౌరసంబంధాలు, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు. 2019లో ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుర్జ్య నారాయణ్ పాత్రో 2022లో రాజీనామా చేశారు.