కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలవచ్చునని ఆశించిన కాంగ్రెస్ కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.

సమీప భవిష్యత్తులో పాలక బీజేపీ ప్రభుత్వాన్ని తాము అస్థిరపరచబోమని కుమారస్వామి స్పష్టం చేశారు. గురువారం జేడీఎస్ కార్యకర్తలను ఉద్దేశించి స్వామి మాట్లాడారు.

ఆరు నెలల్లోగా బీజేపీ సర్కార్ తనంతట తానుగా కూలిపోవచ్చునని, అప్పుడు తాము అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ నేతలు ఆశించారని, కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని కుమారస్వామి అన్నారు.

Also Read:సచిన్ పైలెట్‌కు ఊరట: రేపు హైకోర్టు తీర్పుకు గ్రీన్ సిగ్నల్, అనర్హతపై సుప్రీం కీలక ఆదేశం

ఇప్పుడు ఆ పార్టీ నేతలు చింతిస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. 2018 మధ్యకాలం నుంచి 2019 జూలై వరకు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ కూటమి గురించి కుమారస్వామి పరోక్షంగా ప్రస్తావించారు.

అయితే ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. గతం గురించి ఇప్పుడు ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో ఉంటుందని ఆయన చెప్పారు.