మహారాష్ట్రలో మాజీ ఫైర్ ఆఫీసర్ తన భార్యకు నిప్పు పెట్టి చంపేశాడు. కట్నం కోసం చిత్రహింస పెట్టాడు. ఈ కేసులో మాజీ ఫైర్ ఆఫీసర్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. 

ముంబయి: మహారాష్ట్రలో అగ్నిమాపక శాఖలో పని చేసిన మాజీ ఉద్యోగి తన భార్యపై చిత్ర హింసలకు పాల్పడ్డాడు. కట్నం కోసం వేధించాడు. భోజనం పెట్టకుండా ఆకలితో మాడిపోయేలా చేశారు. ఆ మాజీ ఫైర్ మ్యాన్ ఆఫీసర్ తన భార్యకు నిప్పు పెట్టాడు. సజీవంగా దహనం చేశాడు. ఆరేళ్ల క్రితం తన భార్యపై చేసిన నేరాలకు శిక్ష పడింది. యావజ్జీవిత కాలం ఆ దోషికి కఠిన కారాగార శిక్షను విధించింది. రూ. 7 వేల జరిమానా వేసింది. ఈ ఘటన ముంబయి సబర్బన్ ములుండ్‌లో ఆరేళ్ల క్రితం జరిగింది.

అదనపు సెషన్స్ జడ్జీ ఏబీ శర్మ బుధవారం తుది తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడు లఖాన్ గైక్వాడ్‌ను దోషిగా తేల్చింది. తన భార్యపై క్రూరత్వానికి పాల్పడినట్టు ఐపీసీలోని పలు సెక్షన్‌ల కింద నేరాలకు పాల్పడినట్టు తేల్చింది. ఈ తీర్పుకు సంబంధించిన డాక్యుమెంట్ శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. 

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతా శర్మ ప్రాసిక్యూషన్ ప్రకారం, లఖాన్ గైక్వాడ్ తన భార్య మనీషను శారీరకంగా, మానసికంగా దారుణంగా వేధించాడు.

2017 అక్టోబర్ మనీష పై థిన్నర్ గుమ్మరించాడు. నిప్పు పెట్టి ఆమెను చంపేశాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ ఘటన తర్వాతి రోజునే లఖాన్ గైక్వాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.

Also Read: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. కర్కర్‌దూమా హోటల్ లో చెలరేగిన మంటలు.. ఘటనా స్థలానికి చేరుకున్న 9 ఫైర్ ఇంజన్లు

మనీష తల్లి తన వాంగ్మూలంలో కీలక విషయాలు పేర్కొంది. తన బిడ్డ మనీష పెళ్లి చేసిన సమయంలో గైక్వాడ్‌కు రూ. 1 లక్ష కట్నం ఇస్తామని ఒప్పుకున్నామని వివరించింది. కానీ, తాము ఆ డబ్బును ఇచ్చుకోలేకపోయామని పేర్కొంది. దీంతో గైక్వాడ్ కుటుంబం తన బిడ్డను వేధించడం మొదలు పెట్టిందని తెలిపింది. వార తన బిడ్డకు ఆహారం పెట్టకుండా పస్తులు ఉంచారని, ఆమెకు సరైన వస్త్రాలు కూడా అందించలేదని ఆరోపించింది.

ఈ కేసులో మనీషా అత్తమామలు సహా నలుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారికి వ్యతిరేకంగా ఆధారాలేవీ కోర్టుకు లభించలేకపోయాయి. దీంతో వారు నిర్దోషులుగా కేసు నుంచి బయటపడ్డారు. కాగా, లఖాన్ గైక్వాడ్‌ను మాత్రం దోషిగా తేల్చింది. అతడికి కఠిన జీవిత ఖైదు విధించింది. అలాగే, రూ. 7,000 జరిమానా వేసింది.