మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు హ‌రియాణాలోని నుహ్‌లో జరిగిన అల్లర మాదిరిగానే రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతుంద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, దిగ్విజ‌య్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శనివారం బీజేపీపై మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణ చేశారు. నుహ్‌లా మధ్యప్రదేశ్‌లో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లా అండ్ హ్యూమన్ రైట్స్ సెల్ కార్యక్రమంలో మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. హర్యానాలోని నుహ్‌లో అల్లర్లు సృష్టించిన విధంగానే ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తుందని, ఈ మేరకు తనకు సమాచారం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ ల‌బ్ధి కోసం బీజేపీ దిగజారుడు రాజ‌కీయాలు చేయబోతుందని అన్నారు. ఎందుకంటే.. తమపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీకి అర్థమైందని అన్నారు.

బీజేపీ ఎదురుదాడి

మరోవైపు దిగ్విజయ్ సింగ్ ప్రకటనపై వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ బదులిస్తూ.. ఆ వాతావరణాన్ని తానే సృష్టించిన చరిత్ర దిగ్విజయ్ సింగ్‌కు ఉందన్నారు. అల్లర్లు సృష్టించడం, తమలో తాము కొట్లాడుకోవడం కాంగ్రెస్ విధానమని అన్నారు. 

మ‌రోవైపు ఏడాది చివ‌రిలో జ‌ర‌గ‌నున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ కోసం భారతీయ జనతా పార్టీ .. తన అభ్య‌ర్ధుల తొలి జాబితాల‌ను ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలపై తొలి జాబితా కేంద్రీకృతమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 230 అసెంబ్లీ స్ధానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి, 90 అసెంబ్లీ స్ధానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చేనెలలో ఎన్నికలు జరగనున్నాయి.