శుక్రవారం చందాకొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు...వీడియోకాన్ మనీలాండరింగ్ కేసులో ఈ మేరకు అరెస్ట్ చేసింది. 

న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్‌ సీఈవోగా పనిచేస్తున్నప్పుడు వీడియోకాన్‌ గ్రూపునకు ఐసిఐసిఐ అందించిన రూ. 3,250 కోట్ల రుణంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఇఒ, ఎండీ చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను సిబిఐ శుక్రవారం అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద వీరిద్దరిపై ఏజెన్సీ కేసు నమోదు చేసింది.

వీడియోకాన్ గ్రూప్ కు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 2018లో చందాకొచ్చర్ సిఐసిఐ బ్యాంక్‌ సీఈవోగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇరువురిని విచారించేందుకు ఢిల్లీకి పిలిపించి, కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉన్నందున అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిని ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తరలించే అవకాశం ఉంది.

నిరర్థక ఆస్తిగా మారిన వీడియోకాన్‌కు రుణం 2012లో మంజూరైంది. కొన్నాళ్ల తర్వాత, చందా కొచ్చర్ భర్త, బంధువులు రుణాల మంజూరుతో లబ్ధి పొందారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దీపక్‌ కొచ్చర్‌ స్థాపించిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌లో రుణం ఇచ్చిన నెలరోజుల తర్వాత కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది.

రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. : షాకింగ్ ఆన్సర్ చెప్పిన కేంద్రం

ఇదిలా ఉండగా, మనీలాండరింగ్ కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ ఇంట్లో 2019లో ఈడీ సోదాలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్ సంస్ధకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసిందనే వ్యవహారంలో చందా కొచ్చర్ కీలకపాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది. దీనిలో భాగంగా ఇప్పటికే చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

2020 జనవరిలో మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ ఇల్లు, ఆస్తులను కేసుకు అటాచ్ చేసింది. ముంబైలోని చందా కొచర్ ఫ్లాట్.. ఆమె భర్త దీపక్ కంపెనీకి కొన్ని ఆస్తులను ఈడీ ఈ కేసుకు అటాచ్‌ చేసింది. వీటి విలువ సుమారు రూ. 78 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

2020 సెప్టెంబర్ లో సిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తరువాత అక్కడే అతను కోవిడ్ బారిన పడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని చేసిన విజ్జప్తిని కోర్టు తిరస్కరించింది.