బీజేపీలో చేరిన వైమానిక దళ మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైమానిక దళ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ ను ఘజియాబాద్ లోక్ సభ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉంది.
వైమానిక దళ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఆర్కేఎస్ భదౌరియా బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీ ఆదివారం ఆయనను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే లు పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్కేఎస్ భదౌరియా 2019 సెప్టెంబర్ 30 నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు 23వ ఎయిర్ఫోర్స్ చీఫ్ గా పని చేశారు.
ఆయన ఆగ్రా జిల్లాలోని బాహ్ తహసీల్ కు చెందిన వ్యక్తి. అయితే బీజేపీ ఆయనను ఘజియాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ‘ఇండియా టీవీ’ కథనం పేర్కొంది. బీజేపీలో చేరిన వెంటనే ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) మాట్లాడుతూ.. తాను కొన్ని దశాబ్దాల పాటు ఐఏఎఫ్ కు సేవలు అందించానని అన్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాను పని చేసిన 8 ఏళ్లు ఉత్తమమైనవని అన్నారు. రక్షణ రంగంలో కేంద్రం స్వావలంబనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
మరోసారి జాతి నిర్మాణానికి దోహదపడే అవకాశం తనకు బీజేపీ కల్పించిందని, దానికి కృతజ్ఞతలు తెలిపుతున్నాని ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. దేశ సాయుధ దళాలను శక్తివంతంగా మార్చడానికి, ఆధునీకరించడానికి, వాటిని స్వయం సమృద్ధిగా మార్చడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు దళాలకు కొత్త సామర్థ్యానికి అందించడంతో పాటు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన స్వయం సమృద్ధ చర్య ఫలితాలను క్షేత్రస్థాయిలో చూడొచ్చని భదౌరియా అన్నారు. భద్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా ముఖ్యమైనవని, ప్రపంచవ్యాప్తంగా భారత్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని తెలిపారు.