భారత్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశీ శక్తులు, వారి ఏజెంట్లు మేల్కొంటారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారత ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే చేసిన ప్రకటన భారత్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది. రైతుల నిరసనలను కవర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ట్విట్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఈ విషయంలో వాదప్రతివాదనలు చేసుకుంటున్నారు. కాగా.. ఈ డోర్సీ వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
దారుణం.. ప్రధాని మోడీని, సీఎం యోగిని ప్రశంసించాడని కారుతో గుద్ది చంపిన డ్రైవర్
ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే మాటలు పచ్చి అబద్ధమని అన్నారు. భారత్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనేక విదేశీ శక్తులు మేల్కొంటాయని ఆరోపించారని ‘ఏఎన్ఐ’ నివేదించింది. ‘అతడు (ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే) చెప్పింది పచ్చి అబద్ధం. ఏళ్ల తరబడి నిద్రపోయిన జాక్ డోర్సీ ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకుంటాడు. ట్విటర్ ను మరో వ్యక్తి కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్లాట్ ఫారమ్ ను ఇంత వరకు ఎలా ఎలా దుర్వినియోగం చేశారో ‘ట్విట్టర్ ఫైల్స్’ వెల్లడిస్తున్నాయి. దీంతో జాక్ డోర్సీ బహిర్గతం అయ్యాడు. కానీ ఇప్పటి వరకు వాటికి సమాధానం చెప్పలేకపోయాడు.’’అని ఆయన ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు ఈ ప్రకటనపై అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... ‘‘ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారతదేశంలోని అనేక విదేశీ శక్తులు, వారి ఏజెంట్లు మేల్కొంటారు. అవి గతంలో బహిర్గతమయ్యాయి. ఈసారి కూడా బహిర్గతం చేస్తాం. భారత ప్రజాస్వామ్యం బలంగా ఉంది. ప్రపంచం భారత్ కు ఆశలు కల్పిస్తోంది. భారత్ లో అశాంతిని సృష్టించడంలో విదేశీ శక్తులు విజయం సాధించలేవు’’ అని ఆయన అన్నారు. కాగా.. డోర్సీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.
గతేడాది ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగిన డోర్సీ సోమవారం ‘బ్రేకింగ్ పాయింట్స్ విత్ క్రిస్టల్ అండ్ సాగర్’ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భారత్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కంపెనీపై విదేశీ ప్రభుత్వాల ప్రభావంపై అడిగినప్పుడు ‘‘నిరసనలు తెలిపే రైతులు, ప్రభుత్వాన్ని విమర్శించే నిర్దిష్ట పాత్రికేయులపై అభ్యర్థనలు చేసిన దేశాలలో భారతదేశం ఒకటి. ‘మేము చెప్పినట్టు చేయకపోతే మీ కార్యాలయాలను మూసివేస్తాం. భారత్ లో ట్విట్టర్ ను క్లోజ్ చేస్తాం. మీ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తాం. ఇదీ భారత్, ప్రజాస్వామ్య దేశం.’’ అని అన్నారు.
