Indira Gandhi: ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ కెనడాలో శకటం.. కేంద్ర మంత్రి జైశంకర్ ఏమన్నారంటే?
ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు శకట ప్రదర్శన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ వీడియోను ఉటంకిస్తూ కెనడా ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలూ విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ బ్లూస్టార్‌కు రెండు రోజుల ముందు కెనడాలో ఓ పరేడ్ జరిగింది. బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని గొప్పగా చూపెడుతూ ఓ శకటాన్ని ప్రదర్శించారు. ఆ శకటంలో ఇందిరా గాంధీని టర్బన్‌లు ఉన్న ఇద్దరు సిక్కు సైనికులు కాల్చి చంపుతున్నట్టుగా ఉన్నది. రివేంజ్ అనే బ్యానర్‌తో ఉన్న ఆ శకట ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌నూ ఈ వీడియో గురించి ప్రశ్నించగా స్పందించారు.
ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జైశంకర్ మాట్లాడుతూ ఉండగా.. విలేకరులు ఇందిరా గాంధీ శకటం గురించి ప్రశ్నించారు. ఇందుకు సమాధానం చెబుతూ కెనడా ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. కెనడాలో ఇలా మాజీ ప్రధాని హత్యను గ్లోరిఫై చేస్తూ శకటం ప్రదర్శించే అనుమతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఇలాంటి వాటిని అనుమతిస్తున్నారా? అనే ప్రశ్న తనలో ఉన్నదని, లేదంటే.. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు. ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా సమస్యలు ఇలాంటివి ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: హిందువుగా నమ్మించి ఇద్దరు అక్కాచెల్లళ్లతో పారిపోవడానికి స్కెచ్.. ఎలా దొరికాడంటే?
కెనడాలో వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు, హింసను నూరిపోసే వారికి చోటు ఉండటం వెనుక ఇంకా మరేదో అంశం ఉండి ఉంటుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఇది కెనడా సంబంధాలకు మంచిది కాదని, కెనడాకూ మంచిది కాదని వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ డియోరా ట్వీట్ చేశారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని చిత్రీకరించిన ఈ శకట పరేడ్ జరగడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని వివరించారు. ఇది ఎవరి ఎటు వైపు అని ఆలోచించే సందర్భం కాదని, దేశ చరిత్రపట్ల గౌరవం, ప్రధాని హత్య వల్ల కలిగిన బాధకు సంబంధించినదని తెలిపారు. ఈ తీవ్రవాదాన్ని అంతా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌ను ఇతర కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, శశి థరూర్ సహా పలువురు రీట్వీట్ చేస్తూ తమ కామెంట్లు చేశారు. మిలింద్ డియోరాను సమర్థిస్తూ ట్వీట్లు చేశారు. ఔను.. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలని పేర్కొన్నారు.