మధ్యప్రదేశ్‌లో ఓ స్కూల్‌లో వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో వ్యాక్సినేటర్ పిల్లలకు ఒకే టీకా వేయడానికి ఒకే సిరంజీని వాడటం కలకలం రేగింది. పేరెంట్స్ ప్రశ్నించగా తనకు ఒకే సిరంజీ వాడాలనే ఆదేశాలు ఉన్నాయని మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

భోపాల్: ఒక టీకా డోసును ఒక వ్యక్తికి ఒక సిరంజీతో వేస్తారు. ఒక సారి వాడిన సిరంజీని మళ్లీ వాడరు. అందుకే ఉదాహరణకు 30 మందికి టీకా వేశారంటే.. 30 సిరంజీలను వినియోగించినట్టే. కానీ, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ నిబంధన ఉల్లంఘించారు. జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా వేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ డిపార్ట్‌మెంట్ హెడ్ ఒకే సిరంజీ పంపించాడని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించాడని, అందులో తన తప్పు ఏమున్నదని బుకాయించడం చర్చనీయాంశం అయింది.

ఒకే సిరంజీతో 30 మంది పిల్లలకు టీకా వేసిన విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలిసింది. వారంతా వ్యాక్సినేటర్ జితేంద్రను చుట్టుముట్టారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

టీకా వేయడానికి ఒక డోసుకు ఒక్కో సిరంజీ వాడుతారని తెలియదా? అని పేరెంట్స్ అడిగారు. అందుకు తనకు తెలుసు అనే సమాధానం ఇచ్చారు. మరి ఎందుకు 30 మంది పిల్లలకు సింగిల్ సిరంజీనే యూజ్ చేశావని నిలదీశారు. దీనికి తమకు డిపార్ట్‌మెంట్ హెడ్ కేవలం ఒకే సిరంజీని పంపించాడని చెప్పాడు. ఒక్కో డోసుకు ఒక్కో సిరంజీ వాడాలని తనకు తెలుసు అని, అందుకే ఒక్క సిరంజీ పంపించగానే తాను పై అధికారిని అడిగానని తెలిపాడు. వారు ఒకే సిరంజీని వినియోగించాలని చెప్పారని, అందుకే వారి ఆదేశాలు పాటిస్తూ ఒకే సిరంజీని వినియోగించానని పేర్కొన్నాడు.

Scroll to load tweet…

వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యాక్సినేటర్ జితేంద్ర ఉల్లంఘించాడు. అందుకే సాగర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ జితేంద్ర నిర్లక్ష్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జితేంద్రతోపాటు వ్యాక్సిన్, ఇతర మెటీరియల్ పంపించే జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్‌పైనా కేసు పెట్టారు.