2019 ఎన్నికల ఫలితాలపై జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే అధికారం చేజిక్కించుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యలో ఆయన పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.

ప్రశాంత్ కిశోర్.. మొదట్లో రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలిచేందుకు సహాయం చేసేవారు. కాగా.. కొంత కాలం క్రితం ఆ వృత్తిని వదిలేసి జేడీయూలో చేరారు. కాగా.. ఈ విషయంపై వివరణ కోరగా.. తాను బిహార్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. జేడీయూ చిన్న పార్టీ అయినప్పటికీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టని చరిత్ర ఉందని.. అందుకే అందులో చేరానని తెలిపారు.

తన లెక్క ప్రకారం.. 2019 ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే పైచేయి అని తెలిపారు. ‘‘ ఎన్నికల్లో గెలవాలన్నా.. ఓడాలన్నా.. ఎన్నికలకు ముందు 10 రోజులే కీలకమని నా పన్నెండేళ్ల అనుభవం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు వేసే అంచనాలన్నీ నిజం కాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తుంది.’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. భారీ ర్యాలీలు చేసే కంటే.. 30సెకన్ల వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఓటరుపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.