Asianet News TeluguAsianet News Telugu

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారిణి ప్రియ... నలుగురు డాక్టర్లపై కేసు నమోదు...

వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ఫుట్‌బాల్ క్రీడాకారిని కాలు కోల్పోయి, మృతి చెందిన ఘటనలో నలుగురు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Footballer priya death tragedy, case against four doctors in Chennai
Author
First Published Nov 19, 2022, 11:12 AM IST

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఓ ఫుట్ బాల్ క్రీడాకారిణి మృతి సంచలనం రేపింది. స్థానిక పెరియార్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తప్పుడు చికిత్స చేయడంతో.. ఫుట్బాల్ క్రీడాకారిణి ప్రియ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ప్రియ మృతికి బాధ్యులుగా భావిస్తున్న నలుగురు డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారిమీద విచారణ జరపాలని దీనికోసం వారికి వారికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. వైద్యనిపుణులు సింగార వడివేలన్, శ్రీధర్ తో కూడిన ప్రత్యేక కమిటీ ప్రియ మృతి వ్యవహారంలో నివేదిక తయారు చేశారు.  

ఈ నేపథ్యంలోనే ప్రియకు ఎలాంటి చికిత్స అందించారు.. ఏం చేశారు లాంటి వివరాలు సేకరించారు. ఈ వివరాలతో నివేదిక తయారు చేశారు. ఈ రిపోర్టును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ద్వారా పోలీసులకు అప్పగించారు. వీరి నివేదికలో తప్పుడు చికిత్స, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పుట్ బాల్ క్రీడాకారిణి ప్రియ మృతి చెందినట్లు నిర్తారించారు. కాగా, మెడికల్ రిపోర్టు ఆధారంగా ఆపరేషన్ చేసిన డ్యూటీ డాక్టర్, ఆర్థోపెడిక్,  అనస్థీషియా డిపార్ట్ మెంట్లకు చెందిన నలుగురు వైద్యుల మీద కేసులు నమోదు చేశారు. వీరితో పాటు ఆ రోజు డ్యూటీ లో ఉన్న వార్డుబాయ్ మీద కూడా304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ప్రియ మృతి కేసు తమ మెడకు చుట్టుకుంటుందన్న భయంతో.. పెరియార్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు పాల్ రామ్ శంకర్, రాంశంకర్ సోమసుందర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడినుంచే వారు ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారని పోలీసులు తెలిపారు. అయితే, ఈ బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. 

ఆ పిటిషన్ లో వారు గతంలో తాము పలు శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశామని పేర్కొన్నారు. తాము ఆపరేషన్లు చేసిన చాలామంది ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారని, అయితే, దురదృష్టవశాత్తూ ఫుట్బాల్ క్రీడాకారిని ప్రియ మరణించిందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో వైద్య నిపుణుల కమిటీ విచారణకు హాజరుకావాల్సి ఉందని.. అందుకే తమకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని ఆ డాక్టర్లు తమ పిటిషన్లో అభ్యర్థించారు. 

వైద్యుల నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన ఫుట్ బాల్ క్రీడాకారిణి....

ఇదిలా ఉండగా, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ ఫుట్ బాల్ క్రీడాకారిణి కాలు కోల్పోయి, మృతి చెందిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఆర్‌ ప్రియా(18) చెన్నై నివాసి. ఆమె కుడి మోకాలు దెబ్బ తగిలింది. దీంతో దానికి శస్త్రచికిత్స చేసి సరిచేస్తే మరింత మెరుగ్గా ఫుట్ బాల్ ఆడగలుగుతుందని పెరియార్ నగర్ ప్రభుత్వ పరిధీయ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఆట మీద ఉన్న ప్రేమతో ఆమె దీనికి అంగీకరించింది. అయితే అదే తన పాలిట శాపంగా మారుతుందని తనను శాశ్వతంగా అంగవికలురాలిగా మారుస్తుందని ఆ సమయంలో ఆమె ఊహించలేకపోయింది. 

ప్రియ క్వీన్ మేరీస్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మొదటి సంవత్సరం విద్యార్థి. సోమవారం రెండో సర్జరీ తరువాత  రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (RGGGH)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉంది. నవంబర్ 7న ఆమెకు మొదటి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆమెకు చెడ్డరోజులు పోయాయని ఆమె తిరిగి ఆరోగ్యంగా మారుతుందని వారి కుటుంబసభ్యులు భావించారు. కానీ, ఆమెను దురదృష్టం వెంటాడింది. చివరికి ఆమె మృత్యువు ఒడికి చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios