న్యూఢిల్లీ:రైతుల నుండి పంటలు కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు రూ,. 6700 కోట్లతో ప్రత్యేక సహాయం అందించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  మూడు కోట్ల మంది తీసుకొన్న రూ. 4.22 లక్షల లోన్లపై మూడు మాసాల మారటోరియం విధిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇప్పటివరకు పంట రుణాలు తీసుకొన్న వారు మే 31 వరకు చెల్లించే వడ్డీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది సర్కార్. మార్చి 1 నుండి మే 31వరకు రైతులు తీసుకొన్న రుణాలపై వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర మంత్రి తెలిపారు.

25 వేల కోట్లతో కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు  చేశామన్నారు.మార్చి- ఏప్రిల్ మధ్య 63 లక్షల మంది రైతులకు రూ.86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చినట్టుగా వివరించారు.అంతేకాదు మార్చి- ఏప్రిల్ మాసాల మధ్య నాబార్డు, సహాకార బ్యాంకులకు రూ. 29,500 కోట్లను రీ ఫైనాన్స్ చేశామన్నారు.

also read:వలస కార్మికులు, రైతులు, చిరు వ్యాపారుల కోసం 9 పాయింట్ ఫార్ములా: నిర్మలా సీతారామన్

గురువారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. వలస కూలీలు, వీధి కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్లతో కార్యాచరణను ప్రకటిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. వలసకూలీలు, వీధి, చిరు వ్యాపారులు, చిన్న, సన్న కారు రైతులకు ఈ ప్యాకేజీ వర్తిస్తోందన్నారు. వ్యవసాయానిక ఊతంగా ఈ ప్యాకేజీ ఉంటుందన్నారు.గత రెండు నెలల్లో గ్రామీణ మౌళిక సదుపాయాల కోసం రాష్ట్రాలకు రూ. 4200 కోట్లు కేటాయించామన్నారు.

పంట రుణ అవసరాల కోసం నాబార్డు రూ. 30 వేల కోట్లు అదనపు రీ ఫైనాన్స్ మద్దతును అందిస్తుంది.  మే, జూన్ మాసాల్లో పంట కోతలతో పాటు రబీలో పంట వేయడానికి ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. 

ప్రస్తుత ఖరీప్ అవసరాలు తీర్చేందుకు 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు, మత్స్యకారులు, పశుసంవర్థక కార్మికులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీ రుణాలను కేంద్రం ప్రకటించింది.

పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు  లేని మత్స్యకారులు, పశుసంవర్ధక కార్మికులకు కూడ ఈ కార్డు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. 
2.5 కోట్ల మంది రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీ క్రెడిట్ ను విస్తరించనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.