జమ్ము కశ్మీర్ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి గడప ఎందుకు తొక్కారని అడిగారు. కశ్మీర్ అంశం భారత దేశానిదేనని, దాన్ని అంతర్జాతీయం చేయడం మూలంగా ఇప్పటికి పొరుగుదేశం దాన్ని దురుపయోగం చేస్తున్నదని తెలిపారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రశ్నలు కురిపించారు. జమ్ము కశ్మీర్ అంశాన్ని ఆయన ఎందుకు అంతర్జాతీయం చేశారు? ఎందుకు అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకువెళ్లారు? అని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అడిగారు. జమ్ము కశ్మీర్ అంశం భారత దేశానికే సంబంధించినదని, దాన్ని అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

భారత దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948లో జమ్ము కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తీసుకెళ్లారు. 1948 జనవరిలో అక్కడ ఓ పిటిషన్ ఫైల్ చేశారు. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య తొలిసారి యుద్ధం జరిగిన తర్వాత ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఆ పిటిషన్ ఆధారంగానే భద్రతా మండలి ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించడానికి ఒక యూఎన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ విషయాలపై రాజ్యసభలో తాజాగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడారు. కశ్మీర్ ఇష్యూ భారత్‌కు సంబంధించిన ఇష్యూ అని పేర్కొన్నారు. కానీ, ఆ అంశాన్ని కాంగ్రెస్ ఐరాసకు తీసుకెళ్లిందని తెలిపారు. ‘ఎవరు తీసుకెళ్లారు? భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐరాస ముందుకు తీసుకెళ్లారు. ఎందుకు? ఈ వివాదం సద్దుమణగాలంటే ఐరాస జోక్యమే సరైందని అప్పటి బ్రిటీషర్లు భారత తొలి ప్రధాని నెహ్రూకు చెప్పి ఉండొచ్చు. ఆ సలహాల మీదే జవహర్‌లాల్ నెహ్రూ ఐరాను ఆశ్రయించి ఉండవచ్చు’ అని ఆమె అన్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ మన పొరుగు దేశం (పాకిస్తాన్) దురుపయోగిస్తున్నదని అన్నారు. 

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అనేది నిర్వివాదాంశం అని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లాల్సిన అవసరం లేనిదని తెలిపారు. ఇది కేవలం భారత్‌కు సంబంధించిన అంశమే అని స్పష్టం చేశారు. స్వతహాగా మనమే ఆ వివాదాన్ని హ్యాండిల్ చేయాల్సిందని పేర్కొన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కశ్మీర్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నదని వివరించారు. తమ ప్రభుత్వ పాలనలో అక్కడ మార్పు కనిపిస్తున్నదని తెలిపారు.