భారీ వర్షాలతో  బీహార్ రాష్ట్రంలో  జనజీవనం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 9 జిల్లాలు వరదకు గురైనట్టుగా  విపత్తు నిర్వహణ శాఖ  అధికారులు ప్రకటించారు.

పాట్నా: భారీ వర్షాలతో బీహార్ రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 9 జిల్లాలు వరదకు గురైనట్టుగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించారు.

అరారియా, కృష్ణగంజ్, షిహర్, సితామరి, తూర్పుచంపారన్, సుఫౌల్, మధుబని, దర్భంగ్, ముజఫర్‌పూర్ జిల్లాలోని 18 లక్షల మంది వరద బారిన పడినట్టుగా అధికారులు ప్రకటించారు.

ఈ వరదల కారణంగా సుమారు 13 మంది మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. అరణ జిల్లాలో 9 మంది మృత్యువాత పడ్డారు. వరదల వల్ల మృత్యువాత పడిన ఒక్కో కుటుంబానికి రూ. 4లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టుగా బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.

సీతమర్తి జిల్లాలో ఇద్దరు మరణించారు. మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యారు. వరద ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అరారియా జిల్లాలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది.వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకొనేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేయనుంది. బాధితులు ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాల్సిందిగా అధికారులు కోరారు.

మహానంద నది ఉగ్రరూపం కారణంగా మెయిన్ రోడ్డు దెబ్బతింది. దీంతో ఎస్ఎస్‌బీ బృందం ఈ రోడ్డు మరమ్మత్తులు నిర్వహిస్తోంది. వరద కారణంగా మధుబని జిల్లాలో ఏడుగురు ఆచూకీ లేకుండాపోయింది.వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ఏరియల్ సర్వే నిర్వహించారు.