గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వర్షాలతో వణికిపోతోంది. ఇప్పటి వరకు వర్షాల కారణంగా యూపీలో 60 మంది మరణించగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వాగులు, వంకలు పొటెత్తడంతో నదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.

ఎన్నడూ లేని విధంగా యమునా నది కదం తొక్కుతోంది. హీరాకుడ్ ప్రాజెక్ట్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలడంతో నది ప్రవాహం భారీగా పెరుగుతోంది.. దీంతో దేశరాజధాని ఢిల్లీకి వరద ముంపు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని.. అవసరమైతే పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ప్రజలకు పునరావాసాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.