Odisha floods: ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు చోట్ల వరదలు సంభవించాయి. శుక్రవారం, శనివారాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే హెచ్చరికలు జారీ చేసింది.  

Odisha rain: ఒడిశాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భువనేశ్వర్ వాతావరణ కేంద్రం రాబోయే రెండు రోజులలో అంటే శుక్ర, శనివారాల్లో ఒడిశాలో కుండపోత వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌ల సంభ‌విస్తున్నాయి. మ‌రో రెండు రోజులు కురిసే భారీ వ‌ర్షాల కార‌ణంగా ఒడిశాలో ప్రస్తుత వరద పరిస్థితులు మరింత దిగజార్చవచ్చు. ఈశాన్య బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు తీరాల వైపు వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒడిశా విభాగం తెలిపింది. రెండు రోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.

ఒడిశా భారీ వ‌ర్షాలు సంబంధించిన అప్‌డేట్‌లు ఇలా ఉన్నాయి:

  • శుక్రవారం ఉదయం ఉత్తర బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థ తీవ్రరూపం దాల్చుతుందని, ఆ తర్వాత గంగా నది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ బులెటిన్ తెలిపింది.
  • భార‌త వాతావ‌ర‌ణ శాఖ శుక్ర‌వారం నాడు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కియోన్‌జర్, మయూర్‌భంజ్‌లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ (అత్యంత భారీ వర్షం) ప్ర‌క‌టించింది. ఖుర్దా, పూరీతో సహా ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (భారీ వర్షం) జారీ చేసింది. కటక్, జగత్‌సింగ్‌పూర్, సంబల్‌పూర్‌తో సహా 14 జిల్లాల్లో కురుస్తున్న వర్షం నేప‌థ్యంలో ఆరెంజ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. 
  • శనివారం నాటికి, ఏడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎనిమిది జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది.
  • ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం జగత్‌సింగ్‌పూర్, కేంద్రపాడ, పూరీలలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ మూడు జిల్లాల్లోని గ్రామాలకు 15 రోజుల పాటు సహాయాన్ని పంపిణీ చేయనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. అలాగే కటక్, ఖోర్ధాలో కూడా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. బాధితుల‌కు నిత్యావ‌స‌రాలు అందిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. 
  • ఖోర్ధా, పూరి, కటక్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లోని వరద బాధిత గ్రామాల్లో 15 రోజుల పాటు సహాయాన్ని అందజేస్తామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా, సంబల్‌పూర్, బర్గర్, సోనేపూర్, బౌద్ & అంగుల్ జిల్లాల్లోని ముంపు గ్రామాల ప్రజలకు 7 రోజుల పాటు సహాయాన్ని అందజేస్తామ‌ని పేర్కొన్నారు. 
  • అంగుల్, బర్గర్, బౌధ్, సంబల్‌పూర్, సోనేపూర్ జిల్లాల్లోని ప్రజలకు ఏడు రోజుల పాటు సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది.
  • ప్రభావిత ప్రాంతాల నుంచి వరద నీటిని విడుదల చేసిన ఏడు రోజుల్లోగా జిల్లా యంత్రాంగం నష్టాన్ని అంచనా వేయాలని కూడా CMO పేర్కొంది. అధికారులు 15 రోజుల్లోగా ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం అందించాలని సూచించింది. 
  • ఆగస్ట్ 21న జరగాల్సిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) పరీక్ష వాయిదా వేయబడింది. కొత్త తేదీలు త్వరలో ప్రకటించబడతాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 
  • గత వారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కారణంగా 12 జిల్లాల వ్యాప్తంగా 4.67 లక్షల మందికి పైగా ప్రజలు మహానది నదీ వ్యవస్థలో వరదల బారిన పడ్డారు.