నోయిడా: విగ్రహాల నిమజ్జనం సందర్భంగా యమునా నదిలో మునిగిపోయి నోయిడాకు చెందిన ఐదుగురు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు.  

నోయిడా: నిమజ్జనం అనంతరం నది మధ్యలో విగ్రహం తెలుతూ చిక్కుకుపోయిందని న‌దిలోకి దిగిన ఐదురుగు యువ‌కులు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కృష్ణుడి విగ్రహ నిమజ్జనం సందర్భంగా డీఎన్‌డీ ఫ్లైఓవర్‌ కింద ఉన్న యమునా నదిలో పడి ఐదుగురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులను అంకిత్ (20), లక్కీ (16) లలిత్ (17) బీరు (19), రీతూ రాజ్ అలియాస్ సాను (20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. నిమజ్జనం అనంతరం నది మధ్యలో విగ్రహం చిక్కుకుపోయింది. అప్పుడు, ఆరుగురు అబ్బాయిలు నదిలోకి ప్రవేశించారు, వారిలో ఒకరు మాత్రమే తిరిగి రాగలిగారు. ఐదుగురు అబ్బాయిలు నీటిలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు.

మొత్తం ఐదుగురు బాలుర మృతదేహాలను నది నుండి బ‌య‌ట‌కు తీశామ‌ని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డెడ్ బాడీల‌ను పోస్ట్‌మార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అందరూ గ్రేటర్ నోయిడాలోని సలార్‌పూర్ గ్రామ నివాసితులని పోలీసులు తెలిపారు.