Asianet News TeluguAsianet News Telugu

Demonitisation: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. పెరిగిన నోట్ల చలామణి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిగ్గా నాలుగేళ్ల కింద ఇదే రోజు పెద్ద నోట్లు రూ. 500, రూ. 1000లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నల్లధనాన్ని, అవినీతి సొమ్మును, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, డిజిటల్ ఎకానమీ వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలు సాధించిందనే చర్చ జరుగుతున్నది. 

five years for demonetisation.. what has been achieved so far
Author
New Delhi, First Published Nov 8, 2021, 1:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ఐదేళ్ల కిందట 2016 నవంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి Narendra Modi టీవీ స్క్రీన్‌పై కనిపించారు. ఆ రోజు రాత్రి అందరినీ హతాశయులు చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటన చేశారు. దేశంలో నల్లధనాన్ని(Black Money), అవినీతి సొమ్ముకు చెక్ పెట్టడానికి పెద్ద నోట్లు రూ. 500, రూ. 1000 కరెన్సీ(Currency)ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదుల దగ్గర సొమ్మూ చెల్లకుండా పోతుందని, వారికి ఆర్థికం చేరే మార్గాలనూ ధ్వంసం చేస్తామని తెలిపారు. ప్రధానంగా ఈ లక్ష్యాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Demonetisation నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత డిజిటల్ ఎకానమీనీ తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. Digital చెల్లింపులను ప్రోత్సహించింది. ఈ డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకుని నేటికి ఐదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా నెరవేరిన లక్ష్యాలను ఓ సారి పరిశీలిద్దాం.

రూ. 500, రూ. 1000 నోట్లను చట్ట విరుద్ధ మార్గాల్లో ఆర్జించి, అవినీతి చేసి కొందరు అక్రమార్కులు కూడబెట్టిన సొమ్మును బెడ్ల కింద, గోనె సంచుల్లో దాచుకుంటున్నారని, తద్వార నోట్ల చలామణి తగ్గి సామాన్యులపై ప్రభావం వేస్తున్నదనీ అప్పుడు విశ్లేషించారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని పన్ను అధికారులకు అందిస్తారని, లేదంటే గుట్టు చప్పుడు కాకుండా కాలబెట్టే పరిస్థితిలోకి వారు నెట్టబడుతారని చెప్పారు. ఇలా అక్రమ సొమ్ము బ్యాంకులకు చేరబోవని, ఆ సొమ్మంతా దేశ ప్రజలకు కలిసి వస్తుందని భావించారు. కానీ, ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం, నోట్ల రద్దు తర్వాత దాదాపు 99 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకులకు చేరింది. దీంతో ఈ లక్ష్యం నీరుగారిపోయిందనేది విమర్శకుల వాదన. మరొకటి, నోట్ల రద్దు తర్వాత కూడా ఉగ్రవాదం తగ్గిపోయిన దాఖలాలు లేవు.

Also Read: డీమోనిటైజేషన్ కంటే కరోనా కాలంలోనే పెరిగిన డిజిటల్ పేమెంట్ లావాదేవీలు: సర్వే రిపోర్ట్

నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఐదేళ్లు గడిచినప్పటికీ పూర్తిస్థాయి డిజిటల్ ఎకానమీ సాధ్యం కాలేదు. డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగినప్పటికీ నగదు లావాదేవీలు భారీగానే కొనసాగుతున్నాయి. అయితే, ఇందుకు కరోనా వైరస్ అనే మినహాయింపును కొందరు జోడిస్తున్నారు. కరోనా మహమ్మారి పరిస్థితులను తలకిందులు చేయడంతో ప్రజల్లో సంశయాలు, ఆందోళనలు పెరిగాయి. ముందు జాగ్రత్తలో భాగంగా డిజిటల్‌పై ఆధారపడటాని కంటే నగదును దాచుకోవడం వైపే మొగ్గు చూపారని తెలుస్తున్నది.

ఐదేళ్ల తర్వాత కూడా క్యాష్ సర్కులేషన్ భారీగానే ఉన్నట్టు అధికారిక సమాచారం వెల్లడిస్తున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి నాలుగు రోజుల ముందు దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ ఆర్బీఐ ప్రకారం, రూ. 17.74 లక్షల కోట్లుగా ఉన్నది. కానీ, ఈ ఏడాది అక్టోబర్ 29 నాటికి రూ. 29.17 లక్షల కోట్లుగా ఉన్నదని వివరించింది. అంటే చలామణిలో ఉన్న నగదు గణనీయంగా పెరిగింది. అయితే, డిజిటల్ చెల్లింపులూ భారీగానే పెరిగాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డుల ద్వారా చెల్లింపులు పెరిగినట్టు అధికారిక సమాచారం వెల్లడిస్తున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. క్రమంగా ఇది పుంజుకుంది. గతనెల అక్టోబర్‌లోనే 421 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. సుమారు 7.71 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

Also Read: భిక్షమెత్తి రూ. 65వేలు సంపాదించాడు.. నోట్ల రద్దు తెలియదని బోరుమన్నాడు..!

ఇదిపేదలపై సంధించిన అస్త్రమని విమర్శించాయి. రద్దు చేసిన నోట్లను మార్చుకోవడానికి రోజులపాటు బ్యాంకుల ముందు క్యూలో సామాన్యులు నిలుచోవాల్సి వచ్చింది. సుమారు వంద మంది క్యూలో మరణించినట్టూ అప్పుడు కథనాలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేదని విపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. ఈ నిర్ణయం పెద్ద వైఫల్యమని కాంగ్రెస్ విమర్శించింది.

Follow Us:
Download App:
  • android
  • ios