తాళం వేసి ఉన్న ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అన్నీ ఒకే కుటుంబసభ్యులవి...
శుక్రవారం చిత్రదుర్గంలోని చల్లకెరె గేట్ సమీపంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన వారివిగా అనుమానిస్తున్న ఐదు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. 2019 నుంచి ఇంటికి తాళం వేసి ఉంది.
కర్ణాటక : ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన ఒకటి కర్ణాటకలోకి చిత్రదుర్గలో వెలుగు చూసింది. చిత్రదుర్గలోని ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాలని పోలీసులు కనుగొన్నారు. వీరిలో రిటైర్డ్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి (85), అతని భార్య ప్రేమ (80), కుమార్తె త్రివేణి (62), కుమారులు కృష్ణ (60), నరేంద్ర (57)లు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
ఒక గదిలో ఒక అస్థిపంజరం, మరో గదిలో మిగిలిన నాలుగు లభించాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి స్వస్థలం చిత్రదుర్గ తాలూకాలోని దొడ్డ సిద్దవనహళ్లి. గురువారం రాత్రి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గ ఎక్స్‌టెన్షన్ పోలీసులు ఇంటికి చేరుకుని సోదాలు చేయగా అస్థిపంజరాలు కనిపించాయి.
దావణగెరె నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం అర్థరాత్రి ఇంటిని పరిశీలించింది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ డైరెక్టర్ దివ్య వి.గోపీనాథ్, ఆమె బృందం శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. తదుపరి పరీక్షల నిమిత్తం అస్థిపంజరాలను తరలించారు. వారు చివరిసారిగా 2019లో కనిపించారని, అప్పటి నుంచి వారి నివాసం తాళం వేసి ఉందని పోలీసులు శుక్రవారం తెలిపారు.
శ్రీమంతురాలు కావాలని నలుగురిని పెళ్లి చేసుకున్న యువతి.. తరువాత ఏం జరిగిందంటే ?
ఇంటిలోని ఒక గోడకు వేలాడుతున్న క్యాలెండర్ లో జనవరి, 2019 అని ఉంది. దీన్నిబట్టి అప్పటి నుండి, క్యాలెండర్ మార్చలేదని తెలుస్తోంది. 2019నుంచి కరెంట్ బిల్లులు కట్టలేదు. మొదట మూడు అస్థిపంజరాలు లభించాయని చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ ధర్మేంద్ర కుమార్ మీనా మీడియాకు తెలిపారు. ఆ తరువాత, ఎఫ్ఎస్ఎల్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మరో రెండు అస్తిపంజరాలు వెలుగుచూశాయి.
“కుటుంబ సభ్యులు వారి స్నేహితులు, బంధువులతో టచ్ లో లేరు. ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. తదుపరి విచారణ తర్వాత మాత్రమే చనిపోయిన వారి గుర్తింపును నిర్ధారించగలం”అని పోలీసులు తెలిపారు. తూర్పు రేంజ్ ఐజీపీ కె.త్యాగరాజన్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
చిత్రదుర్గ ఎక్స్‌టెన్షన్ పోలీసులు కుటుంబ సభ్యుల బంధువైన పవన్ కుమార్ ఎన్‌ఆర్ ఫిర్యాదు మేరకు అసహజ మరణ నివేదికను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత 10 నుండి 12 సంవత్సరాలుగా, బంధువులు ఎవరూ వీరి కుటుంబంతో టచ్‌లో లేరని పవన్ తన ప్రకటనలో తెలిపారు. "వాళ్లు ఎప్పుడూ మా ఇళ్లకు రాలేదు. మేమూ వారితో కలవలేదు" అని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత మాత్రమే ఖచ్చితమైన గుర్తింపును నిర్ధారించగలమని, మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి శవపరీక్ష నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
కుటుంబం చివరిసారిగా జూన్-జూలై 2019లో కనిపించింది. ఇంటికి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. సుమారు రెండు నెలల క్రితం, మార్నింగ్ వాక్ కి వెళ్లిన వారు వారి ఇంటి మెయిన్ తలుపు విరిగిపోయిందని గమనించారు, కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు”అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇక ఇంట్లో పలుమార్లు దొంగలు పడ్డ ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
దావణగెరెలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. సాక్ష్యాలను తారుమారు చేయకుండా నేరం జరిగిన ప్రదేశం సీలు చేశారు. "మరణానికి ఖచ్చితమైన కారణం స్పష్టంగా లేదు. ఇవి ఆత్మహత్యలు కావచ్చు లేదా ఇంకేకారణమైనా ఉండొచ్చు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఫోరెన్సిక్ పరీక్ష, శవపరీక్ష చేసిన తర్వాత మాత్రమే మరణానికి గల కారణాలను నిర్ధారించగలం" అని అధికారి తెలిపారు.