బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలతో సహా దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొద్ది రోజులుగా ఇంటి తలుపులు తీయకపోవడం.. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో అనుమానంతో త‌లుపులు తెరిచి చూడగా.. ఇంట్లో ఐదుగురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.

ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న రాఘోపూర్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సీ మనోజ్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. అయితే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ఫోరెన్సిక్‌ బృందాన్ని రప్పించి.. ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పేర్కొంటున్నారు. కుటుంబానికి గ్రామస్తులతో పెద్దగా పరిచయం లేదని, గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులెవరూ ఆ ప్రాంతంలో కనిపించడం లేదని చెబుతున్నారు. అయితే కుటుంబమంతా గత రెండు మూడు రోజుల కిందట మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబానికి అప్పులు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.