మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్-పూణే హైవేపై రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందారు.

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్-పూణే హైవేపై రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గత రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. పూణె నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని షిరోలి గ్రామం సమీపంలో రాత్రి 10.45 గంటలకు 17 మంది మహిళల బృందం క్యాటరింగ్ పని కోసం కళ్యాణ మండపానికి చేరుకోవడానికి హైవేను దాటుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు. 

మహిళలను ఢీకొన్న అనంతరం ఎస్‌యూవీ డ్రైవర్ ‌వేగంగా ముందుకు వెళ్లాడు. అనంతరం యూటర్న్ తీసుకుని తిరిగి పూణే వైపు వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘‘మహిళలు పూణే-నాసిక్ హైవే వెంబడి ఉన్న ఒక కళ్యాణమండపం వద్ద క్యాటరింగ్ పని కోసం పూణే నగరం నుండి వచ్చారు. వారు హైవేను దాటుతుండగా ఎస్‌యూవీ వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదం తర్వాత ఎస్‌యూవీ డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లాడు. అనంతరం పూణే వైపు వెళ్లిపోయాడు’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు. గుర్తు తెలియని ఎస్‌యూవీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు.