పెళ్లిబృందంతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడి ఐదుగురు మృతిచెందగా మరో 11మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

రాంచీ : పెళ్ళి వేడుకలో ఆనందంగా గడిపి తిరిగి వెళుతుండగా ఘోరం జరిగింది. పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పెళ్ళికూతురు తల్లిదండ్రులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా దుమ్రి సమీపంలోని కటరి గ్రామానికి చెందిన యువతికి సంరంగ్ దిహ్ కు చెందిన యువకుడికిచ్చి పెళ్లిచేసారు. వరుడి ఇంటివద్ద జరిగిన పెళ్ళికి తమ గ్రామస్తులను తీసుకుని ఓ వ్యాన్ లో వెళ్లారు పెళ్లికూతురు తల్లిదండ్రులు లుందరి దేవి, సుందర్ గయర్. పెళ్లి తంతు ముగిసిన తర్వాత పెళ్లికూతురు తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులంతా స్వగ్రామానికి తిరుగుపయనం అయ్యారు. 

Read More దారుణం : ట్రక్కు చక్రాలకింద నలిగి మహిళ, ఏడేళ్ల కొడుకు మృతి...

ఇలా 40మందితో కూడిన పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ మంగళవారం రాత్రి డుమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్దా సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. మూడు నాలుగు పల్టీలు కొట్టడంతో వ్యాన్ లోని పెళ్లి బృందానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మంది తీవ్ర గాయాలపాలవగా వారిని గుమ్లా లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మృతుల్లో పెళ్లికూతురు తల్లి లుందరి దేవి, సుందర్ గయర్ తో పాటు పులికర్ కుందో, సవిత దేవి, నగేసియా వున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా వున్నవారిని మెరుగైన వైద్యం కోసం రాంచీలోని రిమ్స్ కు తరలించారు.