కాంగ్రెస్ 39 మంది సభ్యులతో కొత్త సీడబ్ల్యూసీని  ప్రకటించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. సచిన్ పైలట్, శశిథరూర్, ప్రియాంక గాంధీ వంటి కొత్తవారిని ఈ కమిటీలో చేర్చుకున్నారు. ఈ కమిటీ గురించి ఐదు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వ్యవస్థాగత నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఈ కమిటీలో తాజాగా మార్పులు చేర్పులు జరిగాయి. మొత్తం 39 మంది సభ్యులతో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన ఐదు కీలకమైన విషయాలు చూద్దాం.

1. కొత్త కమిటీలో సచిన్ పైలట్‌కు చోటు కల్పించారు. రాజస్తాన్ ఎన్నికల ముంగిట్లో ఆ రాష్ట్ర నేతను సీడబ్ల్యూసీలో చేర్చడం గమనార్హం. గత కొన్నేళ్లుగా రాజస్తాన్ కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది. అశోక్ గెహ్లాట్ పై 2020లో తిరుగుబాటు చేసిన తర్వాత ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఎన్నికల ముంగిట్లో వీరి మధ్య వైరం సద్దుమణగడానికి ఈ నిర్ణయం ఉపకరించే అవకాశం ఉన్నది.

2. ఆనంద్ శర్మ, శశి థరూర్‌లకూ సీడబ్ల్యూసీలో చోటుదక్కింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నప్పుడు పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేస్తూ 23 మంది కాంగ్రెస్ నేతలు ఓ లేఖ రాసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీలో సమూలంగా ప్రక్షాళన జరగాలని, అన్ని పోస్టులకు పారదర్శకంగా ఎన్నికలు జరగాలని, పలు డిమాండ్లతో వారు లేఖను సోనియాకు రాశారు. అందులో ఈ ఇద్దరు నేతలు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లికార్జున్ ఖర్గేపై పోటీ చేసి థరూర్ ఓడిపోయారు. ఖర్గే కాంగ్రెస్ అధిష్టానం ఎంపికగా అప్పుడు భావించారు.

3. సీడబ్ల్యూసీలో కొత్తగా చేరిన మరికొందరిలో దీప దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్ ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత, దివంగత ప్రియ రంజన్ దాస్ భార్య దీప దాస్ మున్షి. ఆమె పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నేషనల్ మీడియా ప్యానెలిస్ట్‌గా గతంలో పని చేసిన హుస్సేన్ ప్రస్తుత రాజ్యసభ ఎంపీ.

Also Read: 39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ: ఏపీ నుండి రఘువీరారెడ్డికి చోటు, తెలంగాణకు నిరాశే

4. కాంగ్రెస్ కమిటీల్లో యువతను ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ నిర్ణయించింది. గతేడాది కేసీ వేణుగోపాల్ కూడా దీనిపై వ్యాఖ్యానించారు. పార్టీ బేరర్లలో 50 శాతం మంది 50 ఏళ్లలోపే ఉండాలని పేర్కొన్నారు. తాజా సీడబ్ల్యూసీలో కేవలం ముగ్గురు సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్, కే పటేల్ మాత్రమే 50 ఏళ్లకు లోబడినవారు.

5. ప్రియాంక గాంధీని కూడా సీడబ్ల్యూసీలో చేర్చారు. ఆమె యూపీ ఇంచార్జీగా ఉన్నారు. బహుశా ఆమెను యూపీ ఇంచార్జీ బాధ్యతల నుంచి విరమణ ఇచ్చే అవకాశం ఉన్నదని కొన్ని వర్గాలు చెప్పాయి.