Asianet News TeluguAsianet News Telugu

అసోంలో మొద‌టి ఇన్ ఫ్లూయెంజా H3N2 కేసు న‌మోదు.. అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం

New Delhi: ఇన్ ఫ్లూయెంజా వైరస్ కార‌ణంగా జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి శ్వాసకోశ సమస్యలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాజాగా అసోంలో మొద‌టి హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైర‌స్ కేసు న‌మోదైంది. 
 

First Influenza H3N2 case reported in Assam
Author
First Published Mar 16, 2023, 5:07 PM IST

influenza-H3N2 Virus: దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్ర‌స్తుతం ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్రం ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ ఇదివ‌ర‌కు లేఖ రాసింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈశాన్య భార‌త రాష్ట్రమైన అసోంలో కూడా హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైర‌స్ వ్యాప్తి మొద‌లైంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ ర‌కం వేరియంట్ కు చెందిన మొద‌టి కేసు న‌మోదైంద‌ని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) విడుదల చేసిన అధికారిక బులెటిన్ పేర్కొంది. దీంతో వైర‌స్ పై ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వ‌ర్గాలు తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది.

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) నెట్ వ‌ర్క్ ద్వారా అసోంలో అభివృద్ధి చెందుతున్న సీజనల్ ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత అధికార వ‌ర్గాలు సైతం వెల్ల‌డించాయి. కాగా, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, హెచ్3ఎన్ 2 అనేది మానవేతర ఇన్ ఫ్లూయెంజా వైరస్.. అయితే, ఇది మొదట మానవులలో 2011 లో కనుగొనబడింది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి శ్వాసకోశ సమస్యలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, నాడీ లేదా న్యూరో డెవలప్మెంటల్ పరిస్థితులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా అనారోగ్య‌ సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

తమిళనాడులో హెచ్3ఎన్2 కేసులను పర్యవేక్షించడానికి ఆరోగ్య శాఖ మార్చి 10 న రాష్ట్రవ్యాప్తంగా 1000 జ్వర శిబిరాలను నిర్వహించింది. ఒక్క చెన్నైలోనే 200 శిబిరాలు నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ బుధవారం మీడియాకు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందనీ, ఇన్ ఫ్లూయెంజా చికిత్సకు రెగ్యులర్ యాంటీబయోటిక్స్ ను ఉపయోగిస్తున్నామని సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్రంలో డెంగ్యూ కూడా అదుపులోనే ఉందన్నారు.

హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మార్చి 16 నుంచి మార్చి 26 వరకు 8వ తరగతి వరకు విద్యార్థుల పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్ర‌యివేటు పాఠశాలలకు వర్తించేలా మంత్రి ఏ.నమశ్శివాయం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. 18 ఏళ్ల లోపు పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రంగస్వామికి నివేదిక సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "ఆరోగ్య శాఖ నివేదికపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించాము. గత వారం రోజుల్లో సుమారు 400 మందికి హెచ్ 3ఎన్ 2 వైరస్ సోకినట్లు నివేదిక తెలిపింది. బాధితుల్లో అత్యధిక శాతం మంది 18 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు" అని నమశివాయం పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios