ఢిల్లీలోని సాకేత్ కోర్టులో  ఇవాళ  ఉదయం కాల్పుల  ఘటన చోటు  చేసుకుంది. ఈ ప్రమాదంలో  ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారంనాడు ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులకు దిగారు. ఓ మహిళను లక్ష్యంగా చేసుకొని దుండగుడు కాల్పులకు దిగారు. నాలుగు రౌండ్లు దుండగుడు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళ పొట్టలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. 

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై రౌడీషీట్ ఉందని పోలీసులు చెబుతున్నారు. సాకేత్ కోర్టులో జరిగిన కాల్పుల్లో ఎం. రాధ అనే మహిళ కడుపులో బుల్లెట్లు దూసుకెళ్లాయని పోలీసులు చెప్పారు. మహిళ చేతికి కూడా బుల్లెట్ గాయమైందని పోలీసులు ప్రకటించారు.

కాల్పులు జరిపింది రాజేంద్ర ఝాగా గుర్తించారు పోలీసులు. అతడిని బార్ కౌన్సిల్ డిబార్ చేసింది. బాధితురాలిపై 420 సెక్షన్ కింద కేసు ఉందని సమాచారం. బాధితురాలిపై కాల్పులకు దిగిన తర్వాత నిందితుడు క్యాంటీన్ బ్యాక్ ఎంట్రీ ద్వారా షూటర్ తప్పించుకున్నారని ప్రత్యక్ష సాక్షి రంజిత్ సింగ్ దలాల్ చెప్పారు.

గతంలో ఢిల్లీ కోర్టులో ఇదే తరహలో కాల్పులు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2022 సెప్టెంబర్ న ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ లో దుండగులు కాల్పులకు దిగారు. లాయర్ల వేషధారణలో వచ్చిన రాహుల్ త్యాగి, జగదీష్ జగ్గాలు కోర్టు గదిలోకి ప్రవేశించి గ్యాంగ్ స్టర్ జింతేదర్ మాన్ అలియాస్ గోగిపై కాల్పులకు దిగారు.2022 ఏప్రిల్ మాసంలో రోహిణి కోర్టులో ఇద్దరు న్యాయవాదులు, క్లయింట్ మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో కాల్పులు చోటు చేసుకున్నాయి.