బాణాసంచా దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య..
కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని అత్తిబెలెలోని ఓ బాణాసంచా దుకాణం గోడౌన్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 14కు చేరింది.

కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని అత్తిబెలెలోని ఓ బాణాసంచా దుకాణం గోడౌన్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. ‘‘అత్తిబెలెలో 14 మంది ప్రాణాలను బలిగొన్న బాణాసంచా గోడౌన్ ఘటన పట్ల నేను తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. నేను ఆదివారం విషాద స్థలాన్ని సందర్శించనున్నాను. మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని సిద్దరామయ్య పేర్కొన్నారు.
సీఎం సిద్ధరామయ్యకు ఈ ఘటనపై ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం అందిందని.. ఆయన నేరుగా మైసూరు నుంచి దుర్ఘటన జరిగిన ప్రదేశానికి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి సమాచారం, ధృవీకరణలు సేకరించిన తర్వాత సీఎం సిద్దరామయ్య.. ఈ సంఘటనకు సంబంధించి తర్వాతి చర్యలను తీసుకుంటారని పేర్కొంది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అసలేం జరిగిందంటే.. బెంగళూరు శివార్లలోని అత్తిబెలెలో బాలాజీ బాణాసంచా దుకాణం గోడౌన్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 14 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. అయితే బాణాసంచా దుకాణం గోడౌన్‌లో మంటల చెలరేగక ముందే.. ఏడుగురు వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
బాలాజీ క్రాకర్స్ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. క్రాకర్లు భారీగా నిల్వ చేయడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి అత్తిబెలె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. క్రాకర్ షాప్ లైసెన్స్ రామస్వామిరెడ్డి, అతని కుమారుడు నవీన్ పేరుతో ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతరుల కోసం గాలింపు ప్రారంభించారు.
ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం అర్థరాత్రి.. సంఘటనా స్థలానికి చేరుకుని మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
ఇక, మృతిచెందినవారిలో 11 మందిని గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ధర్మపురి జిల్లా హరూర్ తాలుకాలోని నీపతురైకు చెందిన ప్రకాష్ (20), అమ్మపేట్టై గ్రామానికి చెందిన వెట్టప్పన్ (25), ఆదికేశవన్ (23), విజయరాఘవన్ (20), ఇలంబరుతి (19), ఆకాష్ (23), గిరి (22), సచిన్ (22).. కళ్లకురుచి జిల్లాకు చెందిన ప్రబాకరన్ (17), వసంతరాజ్ (23), అప్పాస్ (23)లు ఉన్నారు. మరో మూడు మృతదేహాలు ఎవరివి అనేది గుర్తించాల్సి ఉంది. ఇక, మృత దేహాలను అత్తిబెలెలోని ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉంచారు.
గాయపడినవారిలో నవీన్‌తో పాటు మరో ముగ్గురు బెంగుళూరులోని మడవలలోని సెయింట్ జాన్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అత్తిబెలెలోని ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజీ మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.