సారాంశం


గుజరాత్  రాష్ట్రంలోని  అహ్మదాబాద్ సాహిబాగ్ ఆసుపత్రిలో ఆదివారంనాడు  అగ్ని ప్రమాదం జరిగింది.


గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని  అహ్మదాబాద్  సాహిబాగ్  ఏరియాలోని  ఓ ఆసుపత్రిలో  ఆదివారంనాడు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి నుండి  100 మంది  సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.   అగ్ని ప్రమాదం  విషయం తెలిసిన  అగ్నిమాపక సిబ్బంది  సంఘటన స్థలానికి  చేరుకుని మంటలార్పుతున్నారు.

బహుళ అంతస్తుల  ఆసుపత్రి బేస్ మెంట్ లో  ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ అగ్ని ప్రమాదంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు  ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సురక్షితంగా ఆసుపత్రి నుండి  బయటకు తీసుకు వచ్చారు.

ఇవాళ  తెల్లవారుజామున  ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  ఓ చారిటబుల్ ట్రస్టు ఈ ఆసుపత్రిని  నిర్వహిస్తుంది.ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయని  పోలీస్ ఇన్స్ పెక్టర్  ఎండీ చంపావత్  చెప్పారు.  మంటలు అదుపులోకి వచ్చినప్పటికి  పొగ ఇంకా అదుపులోకి రావాల్సి ఉందని చెప్పారు.అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే  20 నుండి  25 అగ్నిమాపక  యంత్రాలు  సంఘటన స్థలానికి  చేరుకుని మంటలను ఆర్పివేశాయి.  అయితే  అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చిన తర్వాత విచారణ  ప్రారంభించనున్నట్టుగా అధికారులు చెప్పారు.