బెంగుళూరు కోరమంగళ భవనంలో అగ్ని ప్రమాదం: భవనం నుండి దూకిన వ్యక్తి
బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం నుండి తప్పించుకొనేందుకు గాను ఓ వ్యక్తి భవనం పై నుండి కిందకు దూకాడు.
బెంగుళూరు:నగరంలోని కోరమంగళ ప్రాంతంలోని తావరెకెరె మెయిన్ రోడ్డులో ఓ భవనంలో నాలుగో అంతస్థు కేఫ్ లో బుధవారంనాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ భవనంలో మంటలను నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి.
ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్థు నుండి ఇతర అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ఈ భవనంలో చిక్కుకున్నవారిని ఫైరింజన్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. మంటల నుండి తప్పించుకొనేందుకు ఓ వ్యక్తి భవనం పై నుండి కిందకు దూకాడు.భవనం కింది అంతస్తులో పార్క్ చేసిన రెండు బైక్ లు, భవనం సమీపంలోని షోరూమ్ లో ఓ కారు దెబ్బతిందని అధికారులు తెలిపారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్రతి రోజూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామలో గల ఫర్నీచర్ దుకాణంలో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్ కాలిబూడిదైంది.
ఈ నెల 14న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐడీఏ బొల్లారంలో ఓ ప్రైవేట్ ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి.పంజాబ్ లోని ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో ఉన్న 424 మంది రోగులను సురక్షితంగా తరలించారు.