తమిళనాడులో ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి హద్దుమీరి ప్రవర్తించాడు. వినియోగదారులు లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టడం లేదని ఏకంగా అతని కుమార్తెను కిడ్నాప్ చేశాడు. కానీ, ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఉద్యోగి ఆటకట్టించి చేసి అదుపులోకి తీసుకున్నారు. 

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు ఉద్యోగి ఫైనాన్స్ కంపెనీలో నుంచి రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. నెలవారీగా ఈఎంఐలు కడుతూ వచ్చాడు. కానీ, తన ప్రైవేటు ఉద్యోగం పోవడంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేక ఈఎంఐలు కట్టడం ఆపేశాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీ తీవ్ర ఒత్తిడి పెంచింది. ఓ రోజు ఈఎంఐ వసూలు చేయడానికి ఆ ఫైనాన్స్ కంపెనీ ఇంటికి రాగా.. లోన్ తీసుకున్న వ్యక్తి ఇంటిలో లేడు. కానీ, అతని 11 ఏళ్ల కూతురు ఇంట్లో కనిపించింది. అంతే.. ఆమెను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన తిరునెల్వెల్లి జిల్లా మారుత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది.

మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆ ఉద్యోగంతో వచ్చే జీతమే కుటుంబానికి ఆధారం. ఓ అవసరం కోసం ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 50 వేలు అతను అప్పు తీసుకున్నాడు. జీతం నుంచి నెలవారీగా ఈఎంఐలు కట్టేస్తే లోన్ క్లోజ్ అయిపోతుందని అనుకున్నాడు. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టడమూ ప్రారంభించాడు.

కానీ, హఠాత్తుగా ఆయన ఉద్యోగం పోయింది. దీంతో ఆర్థికంగా చితికిపోయాడు. డబ్బుల్లేక ఆపసోపాలు పడ్డాడు. ఇంట్లో ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న వేళ ఫైనాన్స్ కంపెనీ నుంచి వెంటనే ఈఎంఐ కట్టాలనే ఒత్తిళ్లు. కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డా కుదరదని హూంకారం.

Also Read: పెళ్లి చేసుకున్న రోజే వధువుకు కడుపు నొప్పి.. మరుసటి రోజే ప్రసవం.. షాక్‌లో వరుడు.. ఎలా కవర్ చేశారంటే?

ఓ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్.. లోన్ తీసుకున్న రాజా ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా.. ఈఎంఐ వసూలు చేయాలని అనుకున్నాడు. తమతోనే ఆటలాడుతున్నాడని ఆక్రోషంతో వెళ్లాడు. కానీ, తీరా ఇంటికి వెళ్లి చూస్తే రాజా లేడు. రాజా 11 ఏళ్ల కూతురు ఇంట్లో కనిపించింది. అప్పుడే ఓ దుష్ట ఆలోచన విఘ్నేష్ బుర్రలో పుట్టింది. ఆ బాలికను కిడ్నాప్ చేసైనా బెదిరించి ఈఎంఐ వసూలు చేయాలని తలిచాడు. ఆమెను కిడ్నాప్ చేశాడు.

రాజా ఇంటికి వచ్చాక కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్లా వెతకడం ప్రారంభించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు రాజా కూతురిని కనిపెట్టగలిగారు. ఆయన ఎందుకు కిడ్నాప్ చేశాడో కూడా వెంటనే గుర్తించారు. విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కూతురిని క్షేమంగా రాజాకు అప్పగించారు. ఫైనాన్స్ కంపెనీలో జీతం కోసం పని చేస్తున్న విఘ్నేష్.. రాజాకు జీతం రావడం లేదనే సాఫ్ట్ కార్నర్ కోల్పోయాడు. కంపెనీ రూల్స్ ప్రకారం నడుచుకుని రాజాను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేశాడు. ఇందులో భాగంగానే విఘ్నేష్ హద్దు మీరి కటకటాలపాలయ్యాడు.