తొమ్మిదేళ్ల పాలనలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే తపనతోనే తీసుకోవడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల పాలనలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే తపనతోనే తీసుకోవడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన పదవీకాలన్ని ప్రజాసేవగా ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి 9 సంవత్సరాలు అచంచలమైన అంకితభావంతో పనిచేసినట్టుగా చెప్పారు.

‘‘ఈ రోజుతో దేశ సేవలో 9 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా నేను వినయం, కృతజ్ఞతతో నిండి ఉన్నాను. తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న ప్రతి నిర్ణయం, తీసుకున్న ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేయబడింది. అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి మేము మరింత కష్టపడి పని చేస్తాము’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

‘‘మా అభివృద్ధి ప్రయాణం సంగ్రహావలోకనం పొందడానికి ఈ సైట్ https://nm-4.com/9yrsofsevaని సందర్శించమని నేను ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను. వివిధ ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు ఎలా ప్రయోజనం పొందారో తెలియజేసేందుకు కూడా ఇది అవకాశాన్ని ఇస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘గత 9 సంవత్సరాలుగా భారతదేశంలోని పేదల గౌరవాన్ని నిలబెట్టడానికి, జీవనోపాధిని పెంచడానికి మేము కృషి చేసాము. అనేక కార్యక్రమాల ద్వారా మేము మిలియన్ల జీవితాలను మార్చాము. ప్రతి పౌరుడిని ఉద్ధరించడం, వారి కలలను నెరవేర్చడం అనే మా లక్ష్యం కొనసాగుతుంది’’ అని మోదీ చెప్పారు.

Scroll to load tweet…


కేంద్రంలో అధికార బీజేపీ ప్రభుత్వం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. మంగళవారం నుంచి ఒక నెల రోజుల ప్రచారాన్ని ప్లాన్ చేసింది. ప్రధాని మోదీ స్వయంగా బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ర్యాలీలో ప్రసంగించనున్నారు. కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా సీనియర్ బీజేపీ నాయకులు సోమవారం దేశవ్యాప్త ప్రచారంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు.