ఆగ్రాలో ఓ వివాహ విందులో రసగుల్లాలు తక్కువయ్యాయని గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

న్యూఢల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఎట్మద్‌పూర్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా విందు జరిగింది. ఈ విందులో వరుడు, వధువు వైపు బంధువులు విందు ఆరగించారు. అయితే, ఆ విందులో రసగుల్లాలు సరిపోలేవు. రసగుల్లాలు తగ్గిపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. చివరకు ఒకరి పై ఒకరు చేయి చేసుకున్నారు. అందులో ఒకరు కత్తి తీసి ఎదుటి వర్గం వారి పై దాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఒకరు కత్తిపోటుకు గురై మరణించాడు. మరో ఐదుగురు గాయపడ్డారు.

మొహల్లా షైఖాన్ నివాసి ఉస్మాన్ కూతురికి పెళ్లి చేశారు. ఎట్మాద్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లిలో భాగంగా విందు నిర్వహించారు. ఈ విందులో రసగుల్లాలు షార్టేజ్ అయ్యాయి. దీంతో వరుడు, వధువు వైపు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Also Read: వైరల్ వీడియో: మిస్ శ్రీలంక పోటీల్లో ఘర్షణ, ఒకరినొకరు కొట్టుకున్నారు..!

ఎట్మద్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ రవి కుమార్ గుప్తా ప్రకారం రసగుల్లాల షార్టేజీ కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి విందుకు హాజరైన వారిపై కత్తితో దాడి చేశాడు. ఇందులో 22 ఏళ్ల సన్ని తీవ్రంగా గాయపడ్డాడు. ఈయనను తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత ఆగ్రాలోని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అక్కడే ట్రీట్‌మెంట్ జరుగుతుండగా మరణించాడు. ఆయన డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారని గుప్తా తెలిపారు. అలాగే, ఈ దాడిలో గాయపడిన ఐదుగురిని ఎట్మద్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపించినట్టు పోలీసులు తెలిపారు.

బాధితుడి కుటుంబం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గుప్తా వివరించారు.