చిన్న క్షవరం విషయంలో దళిత యువకులపై దాడికి దిగారు అగ్రవర్ణాల వారు. దీంతో అవమాన భారం భరించలేక సదరు దళిత యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం యల్‌బుర్గ తాలూకాలోని హోసల్లి గ్రామానికి చెందిన హనమంత,  బసవరాజ్‌ అన్నదమ్ములు. వీరు స్థానిక దళిత కాలనీలో నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ హేయిర్‌ కటింగ్‌ చేయించుకోవటానికి క్షరకులు మల్లప్ప, కలగప్పలను సంప్రదించారు.

వీరు లాక్‌డౌన్‌ కారణంగా షాపులు మూతపడటంతో పిలిచిన వారి ఇంటికి వెళ్లి క్షవరం చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మల్లప్ప,  కలగప్పలు క్షవరం చేస్తున్న అగ్రవర్ణాల వారు నివసించే ప్రాంతంలోకి హనమంత, బసవరాజ్‌లు అడుగుపెట్టారు. తమకు కూడా క్షవరం చేయాలని అడిగారు. అయితే దళిత యువకులు తమ ప్రాంతంలోకి అడుగుపెట్టడాన్ని సహించిన అగ్రవర్ణాల జనం వారిద్దరిని చుట్టుముట్టారు.

దీంతో భయాందోళనలకు గురైన క్షరకులు మల్లప్ప, కలగప్పలు దళిత యువకుల్ని అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. కానీ, వారు ఇదేమీ పట్టించుకోకుండా.. తమకు కూడా క్షవరం చేయాలంటూ పట్టబట్టారు. అటు చుట్టూ మూగిన జనం కూడా తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయినప్పటికీ హనుమంత, బసవరాజ్‌లు వారి మాటల్ని పట్టించుకోలేదు.

Also Read:దళితులంటూ పూజలకు నో చెప్పిన పూజారి: జనగామలో ఆందోళన, అరెస్ట్

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనం అసభ్యపదజాలంతో తిడుతూ, వారిని కొట్టి పంపించేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగారు. వీరిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో పోలీసులు సీరియస్‌ అయ్యారు. పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.