కన్న బిడ్డ మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించలేని నిస్సహాయ స్థితిలో వున్న తండ్రి బస్సులో తరలించాడు.
కోల్‌కతా : కన్న కొడుకు మృతదేహాన్ని బ్యాగ్ లో దాచి 200కి.మీ బస్సులో ప్రయాణించాడు ఓ నిరుపేద తండ్రి. అంబులెన్స్ కు డబ్బులు ఇచ్చుకోలేక నిస్సహాయ స్థితిలో కన్నీటిని దిగమింగి కొడుకు మృతదేహాన్ని బస్సులో తరలించాడు ఆ తండ్రి. ఇలా ఐదునెలల చిన్నారి మృతదేహాన్ని కన్నతండ్రే బ్యాగ్ లో వేసుకుని తరలించిన హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది.
ఉత్తర్ దినాజపూర్ జిల్లా కలియాగంజ్ ప్రాంతానికి చెందిన ఆసిమ్ దేవశర్మ దినసరి కూలీ. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అతడిది. రోజూ కూలీపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇటీవల అతడి భార్య కవల (ఆడ, మగ) పిల్లలకు జన్మనిచ్చింది. ఐదునెలల వయసులో ఈ బిడ్డలిద్దరూ అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆడ బిడ్డ ఆరోగ్యం మెరుగుపడటంతో తల్లీ బిడ్డ ఇంటికి వెళ్లిపోయారు. తండ్రి దేవశర్మ మగబిడ్డను తీసుకుని హాస్పిటల్లోనే వున్నాడు.
గత శనివారం చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమించి మృతిచెందాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు దేవశర్మ అంబులెన్స్ ను ఆశ్రయించాడు. కానీ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్ చేసారు. ఇప్పటికే వైద్యం కోసం తెచ్చిన రూ.16వేలు ఖర్చవడంలో అంబులెన్స్ కు ఇచ్చేందుకు దేవశర్మ వద్ద ఉన్న డబ్బులు సరిపోలేదు. దీంతో చేసేదేమీ లేక బిడ్డ మృతదేహాన్ని తీసుకుని హాస్పిటల్ బయటకు వచ్చేసాడు.
Read More దారుణం.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిన భర్త.. ఎక్కడంటే ?
ఎలాగైనా బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని భావించిన దేవశర్మ కన్నీటిని దిగమింగుకుంటూ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓ బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని దాచి సాధారణ ప్రయాణికుడిలా 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాడు. ఇలా కలియాగంజ్ కు చేరుకున్నాక తక్కువ డబ్బులకు అంబులెన్స్ మాట్లాడుకుని మృతదేహాన్ని అందులో స్వగ్రామానికి తరలించాడు.
కలిసి పుట్టిన బిడ్డల్లో ఒకరు తన ఒడిలో వుండగా మరో బిడ్డ మృతిచెందడం ఆ తల్లిని తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. చంటిబిడ్డ మృతదేహాన్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక బిడ్డ మృతదేహంతోనే వందల కిలోమీటర్లు ప్రయాణించిన దేవశర్మ గ్రామానికి చేరగానే కన్నీరు ఒక్కసారిగా ఉబికివచ్చింది. బిడ్డను అంబులెన్స్ లో తరలించలేని నిస్సహాయ స్థితిని తలచుకుంటూ అతడి కన్నీటిపర్యంతం అయ్యాడు.
ఇలా కన్నబిడ్డ మృతదేహాన్ని తండ్రి గుట్టుగా బస్సులో తరలించిన ఘటన పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారం రేపింది. టీఎంసి పాలనలో రాష్ట్రంలోని నిరుపేదల పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చిని బిజెపి నేత సువేందు అధికారి మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ది మోడల్ ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు.
