భారత పర్యటనలో యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్‌తో ఫాదర్ నికోలస్ డయాస్ ప్రార్థన.. ‘యూఎస్ ఎంబసీ విజ్ఞప్తి’
భారత పర్యటనలో ఉండగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రార్థనల్లో పాల్గొనాలని భావించాడు. ఇందుకోసం ఢిల్లీలోని అమెరికా ఎంబసీ ఫాదర్ నికోలస్ డయాస్‌కు ఫోన్ చేసి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన ఫాదర్ బైడెన్‌తో కలిసి ప్రేయర్ చేశాడు.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడానికి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. పుట్టుకతో క్యాథలిక్ అయిన జో బైడెన్.. ఢిల్లీలో ఉండగా కూడా ప్రార్థనల్లో పాల్గొనాలని భావించారు. న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ఈ ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం ఫాదర్ నికోలస్ డయాస్ జో బైడెన్‌తో కలిసి ప్రార్థన చేశారు. బైడెన్ కోసం, అమెరికా, భారత్ ఉభయ దేశాల పురోగతి కోసం ఆయన ప్రార్థన చేశారు.
ఢిల్లీ ఆర్చిడయాసిస్ లిటర్జీ కమిషన్ సెక్రెటరీ ఫాదర్ నికోలస్‌కు ఓ కాల్ వచ్చింది. అది ఢిల్లీలోని అమెరికా ఎంబసీ నుంచి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో ఉండగా.. ప్రార్థనలో పాల్గొనాలని భావిస్తున్నారని, కాబట్టి, ఫాదర్‌గా సేవలు అందిస్తారా? అని అడిగారని ఫాదర్ నికోలస్ డయాస్ ఏఎన్ఐకి వివరించారు. వారు తన అపాయింట్‌మెంట్ తీసుకుని విజ్ఞప్తి చేశారని, వారి ప్రతిపాదనను తాను సాదరంగా ఆహ్వానించినట్టు చెప్పారు.
తన అమ్మమ్మ నుంచి క్యాథలిక్ విశ్వాసాన్ని తాను ఎలా పొందాడో బైడెన్ తనకు వివరించాడని, అదే వారి సంభాషణకు మొదలు అని ఫాదర్ నికోలస్ తెలిపారు. తాను ప్రార్థన చేశానని వివరించారు. బైడెన్ పర్సనల్ డాక్టర్, అసిస్టెంట్ ఇతరులందరితో కలిసి తాను ప్రార్థన చేశానని తెలిపారు. జీ 20 సదస్సు విజయవంతం కావాలని, భారత్, అమెరికా ఉభయ దేశాలు వర్ధిల్లాలని ప్రార్థించినట్టు చెప్పారు. బైడెన్‌తోనూ తాను వాక్యం చెప్పించానని వివరించారు.
Also Read: సచిన్‌ను గాయపరచాలనుకున్నాను.. ఆ బాల్ వేసినప్పుడు చనిపోయాడనే అనుకున్నా: షోయబ్ అక్తర్ సంచలనం(Video)
ఈ ప్రార్థన ముగిసిన తర్వాత తాను ఇటీవలే గోవా నుంచి తీసుకువచ్చిన బెబింకా స్వీట్ ను బైడెన్‌కు అందించానని చెప్పారు. కాగా, బైడెన్ తనకు అమెరికా అధ్యక్ష సీల్ బహుకరించారని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడి కోసం, ఉభయ దేశాల కోసం ప్రార్థన చేయడం తన జీవితంలో అద్భుత క్షణాలు అని ఫాదర్ నికోలస్ డయాస్ వివరించారు.