సచిన్‌ను గాయపరచాలనుకున్నాను.. ఆ బాల్ వేసినప్పుడు చనిపోయాడనే అనుకున్నా: షోయబ్ అక్తర్ సంచలనం(Video)
సచిన్ టెండూల్కర్‌ను గాయపరచాలని ఉద్దేశ్యపూర్వకంగా బంతి విసిరానని, ఆ బాల్ ఆయన నుదుటికి తాకి వెళ్లిపోయిందని పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బాల్ తాకినప్పుడు సచిన్ ఇక చనిపోతాడనే అనుకున్నానని వివరించాడు. ఇదే విధంగా ఎంఎస్ ధోనీపైనా ప్రయత్నించి విఫలమయ్యానని తెలిపాడు.
న్యూఢిల్లీ: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను సచిన్ టెండూల్కర్‌ను తీవ్రంగా గాయపరచాలనే ఉద్దేశ్యంతో బాల్ వేశానని చెప్పాడు. ఒక బాల్ ఆయన తలకు తగిలిందని గుర్తు చేశాడు. అప్పుడు సచిన్ ఇక చనిపోతాడనే అనుకున్నట్టు చెప్పాడు. కానీ, ఆ బాల్ నుదుటి మీద తాకి వెళ్లి ఆయన ప్రాణాలు దక్కాయని, అయినా.. మళ్లీ ఆయనను తీవ్రంగా గాయపరచాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేసినట్టు షోయబ్ అక్తర్ రివీల్ చేశాడు. అంతేకాదు, ఎంఎస్ ధోనీని కూడా తీవ్రంగా గాయపరచాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేసినట్టు చెప్పాడు. కానీ, ఆయనకేమీ కాలేదని వివరించాడు.
స్పోర్ట్స్ కీడా చేసిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో షోయబ్ అక్తర్ పేసర్‌గా మంచి గుర్తింపు పొందాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా తరుచూ ఆయన వార్తల్లో ఉంటున్నారు. స్పోర్ట్స్ కీడా తీసుకున్న ఈ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2006లో నేషనల్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మూడో టెస్టు మ్యాచ్ గురించి పేర్కొంటూ షోయబ్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ఈ రోజు నేను ఆ విషయాన్ని వెల్లడించాలని అనుకుంటున్నాను. ఆ మ్యాచ్‌లో సచిన్‌ను తీవ్రంగా గాయపరచాలని అనుకున్నాను. ఎట్టిపరిస్థితుల్లోనూ సచిన్‌ను గాయపరచాలనే నిర్ణయించుకున్నాను. బాల్ వికెట్ల ముందు వేయాలని అప్పటి కెప్టెన్ ఇంజామ్ ఉల్ హక్ నాకు సూచించినా ఖాతరు చేయలేదు’ అని షోయబ్ అక్తర్ తెలిపాడు.
ఏమాత్రం పశ్చాత్తాపం ప్రకటించకుండా ఆయన కొనసాగించాడు. ‘కావాలనే నేను ఆయన హెల్మెట్‌కు బంతి తగిలేలా వేశాను. అప్పుడు సచిన్ చనిపోతాడనే అనుకున్నాను. అప్పుడు నేను రీప్లే చూశాను. ఆ బాల్ సచిన్ నుదుటికి తాకినట్టు చూశాను. ఆ తర్వాత మళ్లీ సచిన్‌ను గాయపరచాలని బాల్ వేశాను’ అని షోయబ్ అన్నాడు.
సచిన్‌నే కాదు.. ధోనీని కూడా ఉద్దేశ్యపూర్వకంగా గాయపరచాలని ప్రయత్నించినట్టు షోయబ్ అక్తర్ అంగీకరించాడు. టీమిండియా క్రికెట్ ప్లేయర్లను కావాలనే గాయపరిచే ప్రయత్నాలు చేసినట్టు షోయబ్ అక్తార్ వెల్లడించడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబర్‌లో స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ... మహింద్ర సింగ్ ధోనికి ప్రాణాలు తీసే విధంగా ఓ బాల్ వేశానని చెప్పాడు. 2006లో ఫైసలాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రయత్నం చేసినట్టు వివరించారు.
Also Read: ఈ సారి వర్షమే కాపాడింది.. పాక్ సేనపై షోయబ్ అక్తర్
ధోని గురించి చెబుతూ.. ‘అదే తప్పును నేను ఫైసలాబాద్‌లో ధోనిపైనా కూడా చేశాను. ఉద్దేశ్యపూర్వకంగానే నేను బ్యాట్స్‌మెన్ బాడీకి తాకేలా బంతి విసిరాను. ధోని చాలా మంచివాడు. ఆయనను గౌరవిస్తాను. వాటి గురించి ఇప్పుడు చాలా తప్పుగా అనిపిస్తుంది. ఆయన మంచి ప్లేయర్. నా బౌలింగ్‌లోనూ పరులు రాబట్టాడు. నేను ఎందుకు ఆయనను దాడి చేయాలని అనుకున్నాను? ఒక వేళ ఆ బాల్ గనుక ధోనికి తాకి ఉంటే ఆయన తీవ్రంగా గాయపడేవాడు’ అని షోయబ్ అక్తార్ అన్నారు.
క్రెకెట్ మ్యాచ్‌లలో ఇలాంటి బీమర్‌లు(బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచే లక్ష్యంగా వేసే బంతి) వేయడం నిషేధం. చట్టవిరుద్ధం. ఇది తెలిసి కూడా షోయబ్ అక్తర్ తన ప్రయత్నాలు చేశాడు. కానీ, అందులో దేనిలోనూ సఫలం కాలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూకు ఈ విషయాలు వెల్లడించడంతో దుమారం రేగింది