విమానంలోని తండ్రి ఆశీర్వాదం తీసుకున్న పైలట్.. కూతురి విజయానికి తండ్రి ఆనందభాష్పాలు.. వైరల్ వీడియో ఇదే
కూతురు పైలట్‌గా మారింది. విమానంలో తండ్రి కూర్చున్నాడు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు తండ్రి వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

న్యూఢిల్లీ: పిల్లలు విజేతలు కావాలని, సార్థకులు కావాలని ఆరాటపడతారు. అందుకోసం ఎంతకైనా శ్రమిస్తారు. త్యాగాలు కూడా చేస్తారు. అలా తల్లిదండ్రులు కష్టపడ్డప్పుడు పిల్లలు అందుకు తగినట్టుగానే అనుకున్నదని సాధిస్తే.. ఇల్లంతా సంబురంగా ఉంటుంది. పిల్లలూ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. అలాంటి ఓ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో రూపంలో వైరల్ అవుతున్నది.
తండ్రీ కూతురుల ప్రేమ, ఆప్యాయతను తెలిపే ఓ వీడియో చక్కర్లు కొడుతున్నది. నెటిజన్లు ఆ వీడియో చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి కష్టపడ్డాడు. ఆమెకు ఇష్టమైన వృత్తిని ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆమె పైలట్. తండ్రి విమానంలో కూర్చోగా.. ఆ విమానాన్ని నడపడానికి వెళ్లిన కూతురు ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు తండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు ఆ వీడియోలో ఉన్నది. తండ్రికి పాదాభివందనం చేసి, హగ్ చేసుకుంది. దీంతో ఆ తండ్రి ఆనందభాష్పాలు రాల్చాడు. ఎయిర్ బస్ 320 కెప్టెన్ క్రుతడ్న్యా హేల్ ఈ వీడియోను పోస్టు చేశారు.
పైలట్ కూతురు విమానం నడపడానికి ముందు తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నదని, తండ్రి ఆనందభాష్పాలు రాల్చాడని కెప్టెన్ హేల్ పేర్కొన్నారు. తాన కూడా తన పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకోకుండా ఎన్నడూ ఫ్లైట్ టేకాఫ్ చేయలేదని వివరించారు. తాను ఉదయం 3, 4 గంటల ప్రాంతంలోనూ డ్యూటీలోకి వచ్చేవారని, ఆ సమయంలోనూ పడుకున్న తల్లిదండ్రులను పాదాలను ముట్టుకుని వచ్చేవారని తెలిపారు.
ఈ వీడియోపై చాలా మంది ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ఎందుకో తెలియదు కానీ, ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేకపోయాని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఆమె తన తండ్రికి ఇస్తున్న గౌరవం బాగుందని ఇంకొకరు వ్యాఖ్యలు చేశారు.